ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుకి మధ్య చాలా తేడా ఉందంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై మండిపడ్డారు.

‘‘టీడీపీని ఓడించినందుకే కర్నూలు జిల్లాల్లో అభివృధ్ది పనులు చేపట్టలేదని 6 నెలల క్రితం చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. ఎన్నికల తర్వాత ప్రజలంతా నావారే. ఎవరి పట్ల వివక్ష ఉండదని సీఎం జగన్ గారు స్పష్టం చేశారు. మ్యానిపులేటర్ చంద్రబాబుకు, ప్రజా నాయకుడు జగన్ గారికి తేడా ఇదే.’’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

‘‘లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందన్నఆందోళనతోనే చంద్రబాబు బిజెపితో మళ్ళీ సయోధ్యకు తహతహలాడుతున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యలను పంపించి రూట్‌ క్లియర్‌ చేసుకుంటున్నారు. వీళ్ల ద్వారా బిజెపి పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుంచి బయటపడే ప్లాన్.’’ అని ఆరోపించారు.

‘‘ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్న రెండు సమావేశాల్లోనూ సీఎం జగన్ గారు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. నీతి ఆయోగ్ సమావేశం, అఖిల పక్ష సమావేశంలో హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని శ్రీ మోదీని కోరారు. సానుకూల నిర్ణయం ప్రకటిస్తారని ఆశిస్తున్నాం.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.