గెలుపు, ఓటమి...సహజం. గెలుపు ఆనందాన్ని ఇస్తుంది ... ఓటమి ఆలోచనను  ఇస్తుంది...రెండూ నీతో శాశ్వతంగా ఉండవు'' అంటూ వైసిపి ఎంపీ విజయసాయి ట్వీట్ చేశారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి దశ పంచాయితీ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాలపై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ''గెలుపు, ఓటమి...సహజం. గెలుపు ఆనందాన్ని ఇస్తుంది ... ఓటమి ఆలోచనను ఇస్తుంది...రెండూ నీతో శాశ్వతంగా ఉండవు'' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. 

''పంచాయతీల్లోనూ ఇరవై మూడేనా చంద్రబాబూ? చేసిన పాపాలు కడుక్కోవడానికి నీకు ఈ జన్మ చాలదు. ఎంతమంది నిమ్మగడ్డలు సైంధవుల్లా అడ్డుపడినా కర్మ ఫలం అనుభవించక తప్పదు. నీవు ప్రయోగించే శిఖండులు కూడా తునాతునకలైపోతారు'' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

''అధికారం పోయాక వ్యవస్థలపై కూడా పట్టు జారిపోవడం చంద్రబాబును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఏకగ్రీవాలు ఆపించలేకపోయాడు. నిమ్మగడ్డ ద్వారా ‘ఈ-వాచ్’ యాప్ తో కుట్రలు చేయాలనుకుంటే బెడిసి కొట్టింది. యాప్ ఎక్కడ తయారైందో దర్యాప్తు చేస్తే ఇద్దరూ కటకటాలపాలవుతారు'' అని విజయసాయి హెచ్చరించారు.

read more విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాజకీయాలకు అతీతంగా ఉద్యమం: విజయసాయి

ఇదిలావుంటే టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన చోట ఫలితాలు తారుమారు చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందంటూ ఎస్ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. అధికార వైసిపి నేతలు అధికారులను బెదిరించి ప్రజాభిప్రాయాన్ని కాలరాస్తున్నారని... రిటర్నింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాలను తారుమారు చేస్తున్నారని తన లేఖ ద్వారా ఎస్ఈసీ దృష్టి తీసుకెళ్లారు చంద్రబాబు. 

''కడప జిల్లా రాజుపాలెం మండలం ఎరువుపాలెం, పోరుమామిళ్లలో రాజాసాహెబ్ పేట, కర్నూలులో బండిఆత్మకూరులో జీసీపాలెం, నంద్యాలలో అయ్యలూరు, గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలం, పిలపర్తి, నెల్లూరు జిల్లా కావలిలోని చిలంచెర్ల, విశాఖపట్నం జిల్లాలోని చిడికాడలో దిబ్బపాలెంలో టీడీపీ గెలిచినా వైసీపీ అడ్డుపడుతోంది. కర్నూలు జిల్లా మహానందిలోని బుక్కాపురం, నంద్యాల రూరల్ బిల్లాలపురంలో వెంటనే రీ కౌంటింగ్ జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి'' అని చంద్రబాబు కోరారు.