ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఆ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. అదేవిధంగా గత ప్రభుత్వానికి చురకలు అంటించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, జగన్ పాలనను పోల్చుతూ ట్వీట్లు చేశారు.

‘‘దుబారా ఖర్చులను సిఎం జగన్ గారు కట్టడి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రతి రూపాయి వ్యయానికి అకౌంటబులిటీ ఉంటుంది. హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవిక. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదు.’’ అని పేర్కొన్నారు.

‘‘వృద్ధాప్య,వితంతు,వికలాంగుల పింఛన్లను భారీగా పెంచిన రాష్ట్రంగా ఏపీ దేశంలోనే చరిత్ర సృష్టించింది. కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నావారంతా సిగ్గు పడాలి. నేను చూసాను. నేను ఉన్నాను అంటూ నెలకు పదివేల ఆసరా కల్పించారు యువ ముఖ్యమంత్రి.’’ అని పేర్కొన్నారు.

‘‘జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లింది. గ్రామ  సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయి.చంద్రబాబు హయాంలో నేతలు వందల,వేల కోట్లు పోగేసుకున్నారు. పేదల జీవితాలు అస్థవ్యస్తమయ్యాయి. మా సిఎం వచ్చాడు. కళ్లలో పెట్టుకుని కాపడతాడనే భరోసా కనిపిస్తోందిప్పుడు.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.