సీఎం జగన్ కు అవమానం... విజయసాయి చేతుల్లోనే: వర్ల రామయ్య సంచలనం
గతంలో అచ్చెన్నాయుడికి సరైన చికిత్స అందనప్పుడు ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించిన విజయసాయి ఇప్పుడు రాష్ట్రం దాటి ఎందుకెళ్లాడో చెప్పాలని వర్ల రామయ్య నిలదీశారు.
గుంటూరు: ఏ2 విజయసాయిరెడ్డి కరోనా వచ్చిందని హుటాహుటిన చికిత్స కోసం హైదారాబాద్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గుర్తుచేశారు. అయితే గతంలో అచ్చెన్నాయుడికి సరైన చికిత్స అందనప్పుడు ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించిన విజయసాయి ఇప్పుడు రాష్ట్రం దాటి ఎందుకెళ్లాడో చెప్పాలని నిలదీశారు. విజయసాయి లాంటి వ్యక్తి కరోనా చికిత్సకోసం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరడమంటే ముఖ్యమంత్రి జగన్ ని, ఆయన పాలనను ఎగతాళి చేయడమేనని రామయ్య అన్నారు.
జగన్ ప్రభుత్వం ఆసుపత్రులకు అన్నిహంగులు అద్దిద్దందని అచ్చెన్నాయుడిని ఎద్దేవాచేసిన సాయన్న (విజయసాయి) ఇప్పుడు తనతోపాటు కరోనా చికిత్సకోసం అపోలోకు రావాలని అంబటిని కూడా పిలుస్తున్నాడన్నారు. చంద్రబాబు పాలనలో ఆసుపత్రుల నిర్వహణ బ్రహ్మండంగా ఉంటే జగన్ జమానాలో చండాలంగా ఉందని విజయసాయి తనచర్యల ద్వారా చెప్పకనే చెప్పారని వర్ల ఎద్దేవాచేశారు.
ఇక స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా రాష్ట్రంలో దళితజాతి మొత్తం అభద్రతా భావంలోనే ఉందని...జగన్ నాయకత్వంలో దళితులపై దాడులుపెరిగాయని రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎగిరెగిరి జగన్ కు ఓట్లేసిన దళితులంతా నేడు తప్పుచేశామా అనే భావనలో ఉన్నారని... అందుకు కారణం జగన్ ప్రభుత్వంలో వారిపై జరుగుతున్న దాడులేనన్నారు.
బోటుప్రమాదంపై వాస్తవాలు చెప్పారన్న అక్కసుతో మాజీ ఎంపీ హర్షకుమార్ ని అరెస్ట్ చేసి 43రోజులు జైల్లోపెట్టిన ఈ ప్రభుత్వంలో రాజేశ్, పలనాడులో విక్రమ్, భాగ్యలక్ష్మి, సీతానగరంలో వరప్రసాద్, ఇలాఎందరో బలవుతూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వరుస దాడులు చూస్తుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ -19ను జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తొలగించారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు.
read more ఇంత దారుణమా...ఆ ఆర్టీసి బస్సు నిండా కరోనా రోగులే: ప్రభుత్వంపై చంద్రబాబు గరం (వీడియో)
సీతానగరంలో ఇసుకమాఫియాను ప్రశ్నించాడన్న అక్కసుతో దళిత యువకుడికి శిరోముండనం చేయడం ప్రాణం తీయడంతో సమానమన్నారు. అదేపని వైసీపీ నాయకులకు, ప్రభుత్వ పెద్దలకుచేస్తే ఒప్పుకుంటారా? అని రామయ్య నిలదీశారు. తన గ్రామంలో జరిగే ఇసుక మాఫియాను ప్రశ్నించడమే వరప్రసాద్ చేసిన నేరమా? అన్నారు. వరప్రసాద్ ను తీవ్రంగా అవమానించి, అతనిపై దాడికి పాల్పడేలా స్థానిక ఎస్సైని ప్రలోభపెట్టిన కృష్ణమూర్తి ఎవరని... ఆయనేమైనా రాష్ట్రానికి హోంమంత్రా లేక ఉపముఖ్యమంత్రా అని రామయ్య ప్రశ్నించారు.
విచారణ పేరుతో స్థానిక ఎస్సైని అరెస్ట్ చేశామంటున్న ప్రభుత్వం ఈ ఘటనలో కీలకమైన కృష్ణమూర్తిని అరెస్ట్ చేశాక గొప్పలు చెప్పుకుంటే బాగుంటుందని వర్ల హితవు పలికారు. ఎస్సై కాల్ లిస్ట్ ను కేసు దర్యాప్తు చేస్తున్నవారు పరిశీలించారో లేదో చెప్పాలన్నారు. పోలీసు ఆఫీసర్ నేరస్తుడిలా జైలులో ఉండటానికి కారణమైన వ్యక్తిని, ఎమ్మెల్యే పక్కనుండే కృష్ణమూర్తిని అరెస్ట్ చేసి శిక్షిస్తేనే ఈ ప్రభుత్వం దళితులకు న్యాయం చేసినట్లుగా వారంతా భావిస్తారన్నారు. వరప్రసాద్ చెప్పిన మాటల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నవారు కృష్ణమూర్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రామయ్య ప్రశ్నించారు.
రాష్ఠ్రంలో దళితబాలికపై జరిగిన అత్యాచార విషయం ముఖ్యమంత్రికి తెలుసో..లేదోననే అనుమానం కలుగతోందన్న రామయ్య... నిజంగా జరిగిన దుర్మార్గం ఆయనకు తెలిసుంటే దర్యాప్తు మరోలా ఉండేదన్నారు. 10 నుంచి 15 మంది దుర్మార్గులు బాలికపై పశువుల్లా ప్రవర్తిస్తే, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమెను పోలీసులు కొట్టడం ఏమిటని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి దారుణం జరిగితే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ బాలికను కలిసి ఎందుకు ధైర్యం చెప్పలేదన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పొద్దని పోలీసులే బాలికను బెదిరించారన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ –1989 అమల్లో ఉందో లేదో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. దళితులపై జరుగుతున్న అవమానాలు, దాడులు చూస్తుంటే, ముఖ్యమంత్రి చీకటి సూచనలు ఏమైనా ఇచ్చారేమోనని తనకు అనిపిస్తోందన్నారు. టీడీపీనుంచి వెళ్లిన 9మంది సభ్యుల నిజనిర్థారణ కమిటీ కరోనా ఉందని చెప్పినా ధైర్యంగా బాలికను కలిసి ఆమెకు ధైర్యం చెప్పిందన్నారు. బాలిక వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. అత్యాచారానికి గురైన బాలికకు, అవమానించబడ్డ వరప్రసాద్ కు రూ.కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని రామయ్య డిమాండ్ చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో తీవ్రంగా అవమానించబడిన దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రికి నైతిక విలువలుంటే ఎస్సీ, ఎస్టీ ప్రివన్షన్ యాక్ట్ కింద మంత్రి నేరం చేశాడుకాబట్టి అతన్ని వెంటనే బర్తరఫ్ చేసి, అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు. దళిత మేకపిల్లను వేటాడి వెంటాడిన జస్టిస్ సీ.వీ. నాగార్జున రెడ్డిని తక్షణమే ఈ ప్రభుత్వం పదవినుంచి తొలగించాలన్నారు.
చీరాలలో మాస్కులేదన్న కారణంతో దళిత యువకుడిని కొట్టిచంపడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని...అలా మాస్కులేనివాళ్లను కొట్టడం మొదలుపెడితే ముందు ఎవరిని ఆ పనిచేయాలో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. చీరాలలో చనిపోయిన కిరణ్ కుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలన్నారు.
నెల్లూరులోని గుడిపాడు గ్రామంలో నాటుసారా కాయవద్దన్న పాపానికి దళిత మహిళ ఇంటిని అన్యాయంగా కూలదోశారని, ఆమెకు న్యాయంచేయాలని, కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపైనే ఉందన్నారు. (సదరుమహిళ ఇంటిని వైసీపీకార్యకర్తలు కూలదోస్తున్న వీడియోను విలేకరులకు ప్రదర్శించారు). రాష్ట్రంలో దళితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే, దగ్గరుండి ఆయా వర్గాలపై దాడులు చేయిస్తుంటే వారంతా ఎక్కడికి వెళ్లాలని వర్ల రామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.