గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ కరోనా వైరస్ అత్యంత ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తుంటే వైసిపి ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్లక్ష్యాన్ని వీడటంలేదని మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కరోనా రోగులను వైద్యం అందించడం కాదు కదా వారిని సురక్షితంగా, కరోనా నిబంధనల ప్రకారం కనీసం హాస్పిటల్ కు కూడా తరలించలేక పోతోందని మండిపడ్డారు. ఇందుకు నిన్న కర్నూల్ ఘటన, ఇవాళ వైజాగ్ లో చోటుచేసుకున్న ఘటనలే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. 

''ఆశ్చర్యం! కర్నూలు జిల్లాలో రోగులను అంబులెన్స్‌లో తరలించిన సంఘటన మరచిపోకముందే వైజాగ్‌లో కరోనా రోగులను ఆర్టీసీ బస్సులో కుక్కేసి తీసుకెళుతున్న సంఘటన చోటుచేసుకుంది. ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది..? అతిపెద్ద ఆరోగ్య విపత్తు ఆంధ్రాలో రాబోతోంది అనడానికి ఇదే హెచ్చరిక..!'' అంటూ విశాఖలో ఆర్టీసి బస్సు నిండా రోగులను కుక్కి రవాణా చేస్తున్న వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చంద్రబాబు. 

ఇంతకు ముందే విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్ వార్డులో తమను పట్టించుకునే నాధుడే లేడంటూ కరోనా సోకిన ఓ 8నెలల మహిళ ఆందోళన వ్యక్తం చేయగా దీనిపై కూడా చంద్రబాబు స్పందించారు. వార్డులోని భయానక పరిస్థితులను వివరిస్తూ చిత్రీకరించిన వీడియోను టిడిపి అధ్యక్షులు ట్విట్టర్ లో పోస్టు చేసిన విషయం తెలిసిందే.   

''చనిపోయి నేలమీద పడివున్న రోగి యొక్క ఈ షాకింగ్ వీడియోను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌లో 8 నెలల గర్భిణీ చిత్రీకరించారు.  3 గంటల క్రితం రోగి వాంతి చేసి చనిపోయిగా నేలపైనే పడివుంది. ఇంకా ఆమెకు సహాయం చేయడానికి సిబ్బంది రాలేదని పేర్కొంది.   ఎంత భయానక మరియు బాధాకరమైన సంఘటన ఇది...'' అంటూ సదరు గర్భిణి మహిళ చిత్రీకరించిన వీడియోను జత చేస్తూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.