వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారంటూ విమర్శించారు. టీడీపీ నేతలు త్యాగాలు చేస్తుంటే.. చంద్రబాబు, లోకేష్ లు భోగాలు అనుభవిస్తున్నారంటూ ఆరోపించారు.

రాష్ట్రంలో మద్యపానాన్ని నిరుత్సాహ పరచడమే ప్రభుత్వ విధానమని, ఇందులో భాగంగానే మద్యం ధరలను 75 శాతం పెంచామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు దీనీని రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. వరస ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించారు.

' విశాఖలో హుదూద్‌ను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి అప్పట్లో ఏకంగా రూ. 100 కోట్ల వరకు ఎన్టీఆర్‌ ట్రస్టులోకి లాగారు. తుఫాను బాధితులకు పంచకుండా పెదబాబు, చినబాబులు ఈ మొత్తం సొమ్మును మింగేశారు. ఎన్టీఆర్‌ ట్రస్టు పేరిట తండ్రీ కొడుకులు అసాంఘిక కార్యకలాపాల మీద పూర్తి స్థాయి విచారణ కోరుతున్నా' అంటూ పేర్కొన్నారు.

'  ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ ట్రస్టును లాక్కున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారు. తుఫాను బాధితులకు అంటూ కలెక్షన్లులాగి కోట్లు మింగేశారు... ఏ లోకంలో ఉన్నారోగానీ, ఎన్టీఆర్‌గారూ... మీ అల్లుడి అరాచకాల మీద ఇక కొరడా తీయండి! తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి. త్యాగాలు మీవి...భోగాలు వారివి! నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుకు పావులుగా ఉపయోగపడిన నాయకులూ, కార్యకర్తలూ నిలదీయండి. మీరిచ్చిన విరాళాలు ఎటు పోయాయని అడగండంటూ' విజయసాయిరెడ్డి తెలిపారు.