మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మెదడు చిట్లిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్ పై లోకేష్, మాజీ మంత్రి దేవినేని చేసిన కామెంట్స్ కి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చారు.

‘‘మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పడు అదే చిదంబరం,  ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు  మూడే రోజు దగ్గర్లోనే ఉంది.’’ అంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు.

మరో ట్వీట్ లో ‘‘విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డ్యాటా, అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం మొదటిసారి వింటున్నాం.’’ అని విమర్శించారు. 

అనంతరం దేవినేని పై కూడా మండిపడ్డారు. ‘‘ జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గాలతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ?’’ అని కౌంటర్ ఇచ్చారు.