వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి .. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ప్రతిపక్ష పార్టీ నేతలు, మాజీ సీఎం చంద్రబాబు , లోకేష్ లపై తరచూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. కాగా.. విజయసాయి ట్వీట్లకు తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు.

‘‘కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్‌కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు.’’ అంటూ రామ్మోహన్‌ నాయుడిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కాగా.. దీనికి రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు.  ‘‘అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు.సీనియర్లు అందరూ చేతగానోడి పాలన చూసి ''ఛీ'' కొడుతున్నారు.కారు దించేశారనే కక్షతో మామ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర మొదలెట్టాడు.ప్రత్యేక హోదా పై చేతులెత్తేశారు, ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు. మూడుముక్కలాట మొదలెట్టి మూతిముడుచుకొని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ, అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లేదు.ఢిల్లీలో కాళ్లు మొక్కడం,ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు  విజయసాయిరెడ్డి గారు.’’ అంటూ రామ్మోహన్ ఘాటుగానే జవాబిచ్చారు. జగన్‌, విజయసాయిని మామఅల్లుళ్లు అంటూ సంచలన కామెంట్ చేశారు.