సీఎం జగన్ కు రఘురామ తొమ్మిదో లేఖ... నాణ్యమైన మద్యాన్ని అందించాలంటూ
కొద్దిరోజులుగా సీఎం జగన్ కు వరుస లేఖాస్త్రాలు సంధిస్తున్న ఎంపీ రఘురామ తాజాగా తొమ్మిదో లేఖ రాశారు.
అమరావతి: సొంత పార్టీ వైసిపిపైనే తిరుగుబాటుకు దిగిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు గతంలో మాటలతో ఇబ్బందిపెట్టగా ఇప్పుడు లేఖలతో ఇరకాటంలో పెడుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వం, వైసిపి నాయకులే టార్గెట్ గా ఆయన చర్యలుంటున్నాయి. కొద్దిరోజులుగా సీఎం జగన్ కు వరుస లేఖాస్త్రాలు సంధిస్తున్న రఘురామ తాజాగా తొమ్మిదో లేఖ రాశారు.
తాజా లేఖలో సంపూర్ణ మద్యపాన నిషేధం హామీపై సీఎంని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధ హామీ అమలు కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ కంటే మద్యపాన ప్రోత్సాహకం జరుగుతోందని ఎద్దేవా చేశారు.
read more రఘురామ లేఖాస్త్రాలు : సీఎం జగన్ కు ఏడో లెటర్.. ఈ సారి రైతు భరోసా..
''ఏపీలో గతేడాదితో పోలిస్తే16 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. .మద్యనిషేధం అమలు హామీతోనే మహిళలు వైసీపీకి ఓటువేశారు. అమ్మ ఒడి ద్వారా పేదలకు మీరిచ్చే డబ్బు.. మద్యం ధరల పెంపుతో తిరిగి వసూలు చేస్తున్నారన్న చర్చ మొదలైంది. అమ్మ ఒడి-నాన్న బుడ్డి పథకం అని ఎగతాళి చేస్తున్నారు'' అని అన్నారు.
''సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయండి లేదా కనీసం నాణ్యమైన మద్యాన్ని అందించండి. మద్యం రేట్లను తగ్గించండి. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మన పథకాన్ని ఇల్లు గుల్ల... ఒళ్లు గుల్ల పథకంగా ప్రజలు చెప్పుకుంటారు'' అని రఘురామ సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.