Asianet News Telugu

మీరు నాపై చేస్తున్నవి ఘజనీ దండయాత్రలు... అనర్హత అసాధ్యం: జగన్ కు రఘురామ లేఖ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు వైసిపి రెబల్ ఎంపీ రఘురామ. తనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు వైసిపి ఎంపీలు ఫిర్యాదు చేయడాన్ని రఘురామ తప్పుబట్టారు. 

MP Raghurama Krishnamraju Writes a Letter to CM YS Jagan  akp
Author
Amaravati, First Published Jul 11, 2021, 8:23 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూడిల్లీ: ఆంధ్ర  ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నవ హామీలు - వైఫల్యాలు పేరుతో తొమ్మిది లేఖలు రాసిన రఘురామ ఆ తర్వాత నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరికొన్ని లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తనపై అనర్హత వేటు వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను తప్పుబడుతూ మరో లేఖ రాశారు రఘురామ. 

సీఎం జగన్ కు రఘురామ రాసిన లేఖ యధావిధిగా:  
  
జులై 11, 2021
శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

విషయం: నాపై అనర్హత వేటు వేసేందుకు మీరు చేస్తున్న ‘‘ఘజనీ దండయాత్రలు’’ (విశ్వప్రయత్నం)

సూచిక: నవ సూచనలు (విధేయతతో) లేఖ 4

ముఖ్యమంత్రి గారూ,
మీరు నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించడానికి విఫలయత్నాలు చాలా చేస్తున్నారనేది జగద్విదితం. నాకు గుర్తు ఉన్నంత వరకూ మీరు ఇప్పటికి ఏడు సార్లు నాపై అనర్హత వేటు వేయాలంటూ గౌరవ లోక్ సభ స్పీకర్ కు వివిధ సందర్భాలలో వినతి పత్రాలు సమర్పించారు. నిజానిజాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నా, ఈ అంశానికి సంబంధించి తాము చేయాల్సింది చేస్తామని చెప్పినప్పటికీ కూడా రాజ్యసభ సభ్యుడు, మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గౌరవ చట్ట సభల చైర్ లను దూషించడాన్ని మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ‘‘యధా రాజా తధా మంత్రి’’ అన్నట్లు, విజయసాయి రెడ్డి కచ్చితంగా మీ అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. 

మీరు గౌరవ న్యాయస్థానాలపైనా, గౌరవనీయులైన న్యాయమూర్తులపైనా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసినట్లుగానే అత్యున్నతమైన, గౌరవప్రదమైన వ్యవస్థలపైన విజయసాయి రెడ్డి పలు దఫాలుగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాబోయే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తాం అని ఆయన లోక్ సభ స్పీకర్ ను నేరుగా హెచ్చరించే సాహసానికి కూడా ఒడిగట్టారు. గౌరవనీయులైన లోక్ సభ స్పీకర్ ను ఉద్దేశించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు నేను ఆయనపై ఇప్పటికే సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చాను కూడా.

మీ బృందం చేస్తున్న ఈ చర్యలను పత్రికలలో చదివిన తర్వాత సాధారణ ప్రజలు సైతం ప్రజాసమస్యల పట్ల మీకు ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉన్నదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు అడుగుతున్న ఒక ప్రశ్నను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. అదేమిటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మీ బృందం, ఎందుకు సభలను స్థంభింప చేయడం లేదు? మీరు స్పెషల్ క్యాటగిరి స్టేటస్ పై చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు మన పార్టీకి అనూహ్యమైన మెజారిటీని కట్టబెట్టారు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నది ఏమిటంటే ఒక సహచర ఎంపిపై అనర్హత వేటు వేయించేందుకు పార్లమెంటును స్థంభింప చేసే శక్తి ఉంటే అదే శక్తిని మన రాష్ట్రానికి ప్రత్యేక క్యాటగిరి స్టేటస్ తెప్పించేందుకు ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం పార్లమెంటును స్తంభింప చేయవచ్చు కదా అని వారు అడుగుతున్నారు. 

ఒక పార్లమెంటు సభ్యుడిపై అనర్హత వేటు వేయమని ఇన్ని లేఖలు రాస్తున్నారే పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురావడానికి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎందుకు లేఖలు రాయడం లేదని కూడా ప్రజలు పరిపరి విధాలుగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రాయలసీమకు ఎక్కువ నీటిని అందించి రాయలసీమ భూములను సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది కదా అని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. 

ఒక ఎంపిని అనర్హుడిగా చేయాలని ఇంతగా ప్రయత్నిస్తున్న సాటి ఎంపిలు పార్లమెంటును కూడా స్తంభింప చేస్తామంటున్నారే మరి గత రెండు సంవత్సరాలుగా విశాఖపట్నం రైల్వే జోన్ వ్యవహారం ముందుకు సాగకుండా ఆగిపోయినప్పుడు పార్లమెంటును ఎందుకు స్తంభింపచేయలేదని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతే తీవ్రమైన ప్రయత్నాలు చేసి విశాఖ రైల్వే జోన్ ను సాధించవచ్చు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంత శ్రద్ధతో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుకు కృషి చేసి ఉంటే మీతో కలిసి నడవడానికి, మీకు సంపూర్ణంగా సహకరించడానికి నేను ముందు వరుసలో ఉండేవాడిని. నేను పైన చెప్పిన మూడు విషయాలపై పార్లమెంటును స్తంభింప చేసి ఆ తర్వాత నన్ను అనర్హుడిగా ప్రకటించేందుకు పార్లమెంటును స్తంభింప చేయండి. అలా కాకుండా ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే ప్రజలు మీపై తిరుగుబాటు చేసేందుకు ఎంతో ఎక్కువ సమయం పట్టదు.

ఒక ఎంపిని అనర్హుడిగా ప్రకటించే అధికారాన్ని లోక్ సభ స్పీకర్ నుంచి తీసేసి పార్టీ అధ్యక్షుడికే ఇవ్వాలనే మీ తలంపును అమలులోకి తెచ్చుకోవాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో మూడు వంతుల మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. అది మీకున్న 22 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులతో సాధ్యం కాదు.

మీకు మరో అదనపు సమాచారాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన త్రిసభ ధర్మాసనం ఏం చెప్పిందంటే, పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుల విషయంలో కోర్టులు ఏ మాత్రం జోక్యం చేసుకోలేవు. ఫిరాయింపుల ఫిర్యాదుల పరిష్కారంపై కాలపరిమితిని నిర్ణయించడం కూడా కోర్టుల పరిధిలోకి రాదు. ఇది పూర్తిగా రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, లోక్ సభ స్పీకర్ విచక్షణపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అని ఎంతో స్పష్టంగా సుప్రీంకోర్టు తెలిపిన విషయాన్ని మీకు మరొక్కమారు గుర్తు చేస్తున్నాను. మీరు ఈ విషయాన్ని విజయసాయి రెడ్డికి అర్ధం అయ్యేలా చెప్పాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన మీడియా సమావేశాలలో ఏవేవో విషయాలు మాట్లాడుతున్నారు. స్పీకర్, నిర్ణీత కాల వ్యవధి అంటూ అస్పష్టమైన ప్రకటనలు చేసుకుంటూ, నా అనర్హత ఏదోఒక విధంగా జరగాలని ఆయన ఎంతో ఆశగా కోరుకుంటున్నారు. 

2020 సంవత్సరంలో రాజస్థాన్ లో జరిగిన మరో విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను అక్కడి అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దాంతో ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పుపై రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు చెబుతూ… నిరసన తెలియచేయడానికి, పార్టీ ఫిరాయించడానికి తేడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ స్టే ఎత్తేయడానికి నిరాకరించింది. దాంతో స్పీకర్ తన పిటిషన్ ను ఉప సంహరించుకున్నారు. చివరికి వారిపై అనర్హత వేటు పడలేదు. ఈ మొత్తం కేసులో కీలకమైన అంశం ఏమిటంటే నిరసన తెలియచేయడానికి, పార్టీ ఫిరాయించడానికి తేడాను తెలుసుకోవాలి అని చెప్పడం. 

మీరు నాకు జారీ చేసిన నోటీసులలోనూ, లోక్ సభ స్పీకర్ కు నాపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ లోనూ మీరు చెప్పిన సాకులు పరిశీలిస్తే నాకు అర్ధమైనదేమిటంటే నేను మాతృభాష లోనే ప్రాధమిక విద్యాబోధన ఉండాలనే రాజ్యాంగంలోని 350 ఏ అధికరణ గురించి పార్లమెంటులో మాట్లాడటమే మీకు తీవ్ర అభ్యంతరకరమైన విషయంగా కనిపించింది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీ నమోదు ప్రక్రియలో భాగంగా తమ పార్టీ రాజ్యాంగానికి లోబడి పని చేస్తుందని ప్రమాణ పత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో… మేం రాజ్యాంగంలోని 350 ఏ అధికరణకు వ్యతిరేకంగా పని చేస్తామని ఏ రాజకీయ పార్టీ అయినా తమ ఎన్నికల ప్రణాళికలో చెబితే, ఎవరైనా ఈ విషయాన్ని భారత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళితే, పార్టీ గుర్తింపునే రద్దు చేసే ప్రమాదం ఉంటుంది. నేను రాజ్యాంగానికి కట్టుబడి చేసిన ప్రసంగాన్ని తప్పుపడితే అది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లు అవుతుంది. నేను పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగానికి విధేయుడనై ఉంటానని, మనసావాచా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, ప్రమాణం చేసినందున నేను ఆ విధంగానే లోక్ సభలో ప్రసంగించాను తప్ప పార్టీ సిద్ధాంతాలను ఏనాడూ నేను జవదాటలేదు.

ఏనాడూ పార్టీ విప్ ను ధిక్కరించని వాడిని, ఏనాడూ పార్టీ ఫిరాయించని వాడిని ఎవరినైనా సరే 10వ షెడ్యూలు కింద దోషిగా నిలబెట్టి పార్లమెంటు సభ్యత్వం నుంచి తప్పించలేరు, అనర్హత వేటు కూడా వేయలేరు. అందువల్ల నేను మీకు సూచించేది ఏమంటే నా శక్తియుక్తులను పార్టీ బాగు కోసం, పార్టీ నాయకుడి మేలు కోసం, నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం వాడుకోండి తప్ప ఇలా ప్రవర్తించ వద్దు.

ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది అధికారంలో ఉన్నవారు అక్రమంగా మెజారిటీ సాధించుకోవడానికి, అధికార దాహంతో పార్టీలను చీల్చే రాజకీయ నాయకులను అదుపు చేయడానికి నిర్దేశించిందే తప్ప నాలాంటి వారి కోసం కాదని మీకు స్పష్టం చేస్తూ ఇప్పటికైనా మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుని పునరాలోచించేందుకు ఇది సరైన సమయమని నేను మీకు సూచిస్తున్నాను. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ఫిరాయింపుదార్లను ప్రోత్సహించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయకుండా చూడటం. అంతే కాని పార్టీలలో వచ్చే నిరసన స్వరాలను అణచి పెట్టేందుకు కాదు. ఇదే విషయాన్ని చట్టం రూపొందించే సమయంలో పార్లమెంటు లో జరిగిన చర్చల సందర్బంగా పలువురు చెప్పారు.  అలా పార్టీలలో వచ్చే నిరసన స్వరాన్ని అణచి వేయడం భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కుకు భంగకరమని కూడా ఆ చర్చల సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. 

పాలనా విధానాలపై, ప్రభుత్వ చర్యలపై నిరసన తెలిపే గొంతులను ఈ విధంగా అణచివేయడం ప్రజాస్వామ్యమా? ఇది సాధారణ విషయం కాదు. మనమందరం ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులం. మనమే నిరంకుశంగా ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుంది? ఇది మీకో నాకో చెప్పడంలేదు. నేను కేవలం నా అనర్హత విషయం మాత్రమే ప్రస్తావించడం లేదు. మనందరం కలిసి ఆలోచించాల్సిన అంశం. నేను సిద్ధాంతపరమైన అంశాలనే లేవనెత్తి, పాలనాధికారులను ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తున్న వారిని ప్రజల తరపున ప్రశ్నించాను తప్ప వేరే విధంగా చేయలేదు. 

ఈ నేపథ్యంలో నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే నా అనర్హత అంశంపై నిరంతరంగా, విసుగు విరామం లేకుండా పోరాటం చేయడం, ఆ పోరాటంలో భాగంగా గౌరవనీయులైన లోక్ సభ స్పీకర్ పైనా, గౌరవనీయమైన వ్యవస్థలపైన బురద చల్లే విధంగా మాట్లాడటం కాకుండా న్యాయపరమైన అంశాలను మరొక్క సారి సరి చూసుకోండి. చట్టం గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు ఇదే విధంగా గౌరవనీయమైన వ్యవస్థలను పలుచన చేసి అగౌరవ పరిస్తే మళ్లీ మళ్లీ మీకు న్యాయస్థానాల నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని పేరా 2(ఏ)లో చెప్పినట్లు ప్రభుత్వ నిర్ణయాలపై మంచి చెడు పరిణామాలను చెప్పడమనేది ఆరోగ్యకరమైనదిగానే భావించాలి. రాజకీయ పరిస్థితులు ఏకోన్ముఖంగా ఉండే అవకాశం లేదు. అవి సంక్లిష్టంగానే ఉంటాయి. 

కనీసం ఈ లేఖను చదివిన తర్వాత అయినా మీరు రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన అనే అంశం ప్రాముఖ్యతను కూడా మీరు గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. మీ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యయుత విధానాలు అమలు చేయడం కూడా అనివార్యమని మీరు తెలుసుకోవాలి. అదే విధంగా ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి పూర్తిగా అవగాహన చేసుకుని జాగ్రత్తలు తీసుకుని ఇక నుంచి  బాధ్యతతో మెలగుతారని కూడా ఆశిస్తున్నాను.

భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు
 

 

Follow Us:
Download App:
  • android
  • ios