సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కన్నా కూడా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అభిమానులు ఎక్కువగా ఉన్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పేర్కోన్నారు. నిన్నటి వరకు జగన్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించిన రఘురామ.. ఇంత సడెన్ గా ఇలా మాట్లాడుతున్నారేంటి అనే సందేహం కలుగుతుందా..? కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా ప్రబలుతున్న నేపథ్యంలో... రఘురామ కృష్ణం రాజు.. సీఎం జగన్ కి కొన్ని సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో.. మెగాస్టార్ చిరంజీవి పేరు తీసుకువచ్చి మరీ సూచన చేయడం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళితే... మాస్కు పెట్టుకోవాలంటూ సినీ నటులు చిరంజీవి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయన కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్న సీఎం జగన్ ఓ మంచి కార్యక్రమం చేపడితే బాగుణ్ణు అని అభిప్రాయపడ్డారు. ఓ చక్కని చిత్రం చేసి.. ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. కరోనా నియంత్రణ చర్యల్లో ముందుండాలని విజ్ఞప్తి చేశారు.

 రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. సుమారు 20 కార్యక్రమాలు జగనన్న పేరుతో ఉన్నాయని.. అలాగే జగనన్న పేరుతో ఈ వైరస్‌పై పోరాటం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమం చేపట్టాలన్నారు. జగనన్న పేరు కచ్చితంగా ఉంటేనే ప్రజల్లో, అధికారుల్లో సీరియస్ నెస్ ఉంటుందన్నారు. దీనికి జగనన్న కరోనా కేర్ అనో.. జగనన్న కరోనా వార్ అనో ఏదైనా పేరు పెడితే బాగుంటుందన్నారు.