దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి పురస్కరించుకొని.. ఆయనను ఎంపీ రఘురామకృష్ణం రాజు స్మరించుకున్నారు. వైఎస్ఆర్ వర్థంతి కారణంగా తాను రచ్చబండను రద్దు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. దేశ రాజధానిలోని తన నివాసంలో ప్రతిరోజూ ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ ఒక్కరోజు దానిని రద్దు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘురామ  వైఎస్ఆర్ కి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మందికి అడగకుండానే సాయం చేసిన వ్యక్తిత్వం వైఎస్ఆర్ సొంతమని, ఇవాళ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా రాజకీయ అంశాలపై మాట్లాడనని చెప్పుకొచ్చారు. వర్ధంతి కావున ఆయన గుణగణాలు మాత్రమే చెప్పగలనని.. రేపు అన్ని విషయాలపై చర్చిస్తానన్నారు. 

తన పంచెకట్టు వైఎస్ఆర్ నుంచి కాపీ చేసిందేనని అన్నారు. ఆయన వ్యక్తిత్వం అందరికీ రాదని.. బోయవాడు వాల్మీకిగా మారినట్టు.. సీఎం అయ్యాక ఆయన మారిపోయారన్నారు. వైఎస్ రాగద్వేషాలను దగ్గర నుంచి గమనించానని, ప్రాక్టికల్‌గా చూశానన్నారు. తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు తన పుట్టిన రోజని ఆ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.