చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం.. టీడీపీ అధినేతతో రఘురామ కృష్ణరాజు భేటీ..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబుతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లోనే జరగనున్న జీ20 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకన్న చంద్రబాబు.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు ల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి ముందు చంద్రబాబు నాయుడకు రఘురామ కృష్ణరాజు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ తరపున బరిలో నిలిచిన రఘురామ కృష్ణరాజు విజయం సాధించారు. అయితే కొంతకాలానికే ఆయనకు వైసీపీ అధిష్టానానికి మధ్య గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలోనే రఘురామ కృష్ణరాజు వైసీపీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర సంచలనంగా మారాయి. సీఐడీ పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు.
ఇక, అప్పటినుంచి వైసీపీ సర్కార్‌పై రఘురామ కృష్ణరాజు మరింతగా విమర్శల దాడిని పెంచారు. మరోవైపు బీజేపీ జాతీయ నేతలతో ఆయన సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన రఘురామ కృష్ణరాజు.. ఆ విషయంలో వైసీపీ నాయకులపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటారు. ఇదిలా ఉంటే.. అమరాతి రైతులు తిరుపతిలో నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడును రఘురామ కృష్ణరాజు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.