విజయవాడ ఎంపీ కేశినేని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఉద్దేశిస్తూ... ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. గత కొంతకాలంగా... కేశినేని సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారారు. రోజుకో పోస్టు పెడుతూ సంచలనాలకు దారి తీస్తున్నారు. తాజాగా ఆయన సీఎం జగన్ ని ప్రశ్నిస్తూ ఓ పోస్టు పెట్టారు. 

"గౌరవ ముఖ్యమంత్రి గారు.. నదీ తీర ప్రక్షాళన కేవలం అరవై - డెబ్భై అక్రమ కట్టడాలకు మాత్రమే పరిమితం చేస్తారా? లేకపోతే మన రాష్ట్రంలో కృష్ణా మరియు గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో మన రాష్ట్ర సరిహద్దు నుండి మొదలుపెట్టి ఆ నదులు సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి అన్ని అక్రమకట్టడాలను రివర్ కన్సర్వేటివ్ యాక్ట్ ప్రకారం తొలగిస్తారా! .. కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరించగలరు" అని కేశినేని పేర్కొన్నారు. 

కాగా.. కలెక్టర్ల సదస్సులో భాగంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని.. అది కూడా ‘ప్రజావేదిక’ నుంచి ప్రారంభం కావాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జగన్ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేయగా.. కరకట్టలో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నివాసంతో పాటు పలు కట్టడాలను సైతం కూల్చివేతకు ప్రభుత్వాధికారులు రంగంలోకి దిగి నోటీసులిచ్చారు.