అదే జరిగితే నాకు డిపాజిట్ కూడా దక్కేది కాదు...జేసీ

mp jc diwakar reddy participate in hunger strike
Highlights

*జగన్ ని నేను సర్ అని పిలవాలా?
*నాకు అంత ఖర్మేం పట్టింది?
*పదవి లేకపోయినా టీడీపీలోనే కొనసాగుతా

తనకు పదవి లేకపోయినప్పటికీ టీడీపీలోనే కొనసాగుతానని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. విశాఖటప్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు చేపట్టిన దీక్షలో జేసీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసమే పని చేస్తున్నారని, అలాంటి నేత మరో పదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటే తప్పా? అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిందిగా ప్రయోజనాలను రాబట్టేందుకు సీఎం తన శక్తి మేరకు పోరాడుతున్నారని అన్నారు.రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే తనకు డిపాజిట్ కూడా వచ్చేది కాదన్నారు. 10 ఏళ్లు మంత్రిగా ఉండి కూడా తాను ఏనాడూ పోలవరం ప్రాజెక్టు దగ్గరకే వెళ్లలేదన్నారు. కానీ చంద్రబాబు పట్టుదలతో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ప్రజలకు సంపూర్ణ ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని సీఎం చంద్రబాబు తపన పడుతున్నారని చెప్పారు.

వైఎస్ కంటే కూడా చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డిని తాను సర్ అని పిలిచే ఖర్మ తనకేం పట్టలేదని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో జగన్ వెంట నడిచేవారంతా కేవలం డబ్బు ఇస్తే వచ్చినవారేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని తాను చంద్రబాబుకి సూచించినట్లు గుర్తు చేశారు.
మరో ఐదేళ్లపాటు టీడీపీ అధికారంలో ఉండాల్సిన అవసరం రాష్ట్రానికి ఉందన్నారు. రెండేళ్లలో కోనసీమను తలదన్నేలా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తారు. ఎన్టీఆర్, చంద్రబాబు వల్లే అనంతపురంలో వరిసాగు సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

loader