సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం: 15 విమానాలు, రాజకీయాలకు వేదిక?
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కొడుకు రిత్విక్ నిశ్చితార్థం కోసం 15 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. ఈ నిశ్చితార్థం వేడుకలో రాజకీయాలు ప్రధానం కానున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
విజయవాడ:బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తనయుడు రిత్విక్ వివాహ రిసెప్షన్ వేడుకలు ఆదివారం నాడు దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరుకావాలని పలు పార్టీలకు చెందిన ఎంపీలు, నేతలకు సీఎం రమేష్ ఆహ్వానం పంపారు. ఈ రిసెప్షన్ వేడుకలను పురస్కరించుకొని రాజకీయ చర్చలకు కేంద్రంగా మారిందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
దుబాయ్‌లోని వాడ్డాఫ్ అస్టోరియా,రసాల్‌ఖైమా లో నిశ్చితార్థం వేడుక జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు వీలుగా సీఎం రమేష్ దుబాయ్‌కు వెళ్లేందుకు 15 విమానాలను ఏర్పాటు చేశారు.
ఈ 15 విమానాల్లో 75 మంది ఎంపీలతో పాటు పలువురు ఆయా పార్టీల నేతలు దుబాయ్‌కు వెళ్లనున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేలలు, ప్రజా ప్రతినిధులు కూడ ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు.
టీడీపీ, వైసీపీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు కూడ సీఎం రమేష్ నుండి ఆహ్వానాలు అందినట్టుగా సమాచారం. వైసీపీ ఎంపీలు కూడ ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also read:ఏపీ నేతలపై అపనమ్మకం: నేరుగా రంగంలోకి బీజేపీ ఢిల్లీ పెద్దలు
మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇప్పటికే దుబాయ్‌కు వెళ్లారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కూతురితో సీఎం రమేష్ కొడుకు రిత్విక్‌కు ఇవాళ నిశ్చితార్థం జరగనుంది.
సీఎం రమేష్ వియ్యంకుడు రాజా తాళ్లూరికి ఇటీవలనే ఓ కాంట్రాక్టులో పెద్ద ఎత్తున లాభం వచ్చిందనే ప్రచారం ఉంది. ఈ కారణంగానే పెళ్లిని మరింత గ్రాండ్‌గా నిర్వహించాలని ఆ కుటుంబం భావిస్తోందని చెబుతున్నారు.
దుబాయ్‌లో అతిథులు దిగగానే సీఎం రమేష్, రాజా తాళ్లూరికి చెందిన కుటుంబాలు స్వాగతం పలకనున్నాయి. ఆహ్వానాలు అందిన వారందరికీ సీఎం రమేష్ మరీ ఫోన్లు చేసి తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలని కోరారని సమాచారం.
ఇదిలా ఉంటే దుబాయ్‌లోని ఈ కార్యక్రమంలో బీజేపీలో చేరాలని ఇతర పార్టీల నేతలతో సీఎం రమేష్ సంప్రదింపులు జరిపేందుకు ప్లాన్ చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ విమర్శలు చేశారు.
దుబాయ్‌లో సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం వేడుకలో పాల్గొనేందుకు పలువురు టీడీపీ నేతలు కూడ పాల్గొనే అవకాశం ఉంది. అయితే టీడీపీ నేతలను బీజేపీలో చేర్పించేందుకు ఈ నిశ్చితార్థం వేడుక వేదికగా మారిందనే ప్రచారాన్ని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఖండించారు.
ఈ నిశ్చితార్థం వేడుకలో అన్ని పార్టీలకు చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారని ఆయన గుర్తు చేశారు.పార్టీ మారేందుకు దుబాయ్ వేదికగా చర్చలు జరపాల్సిన అవసరం లేదని బొండా ఉమా మహేశ్వరరావు చెప్పారు.