రాజమండ్రి: బోట్స్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవ సమయంలో ప్రోటోకాల్ ను పాటించలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని అధికారులు దాచేశారు.

బోట్స్ కంట్రోల్ రూమ్  ప్రారంభోత్సవ సందర్భంగా టూరిజంశాఖ ఏర్పాటు చేసిన  ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యేల ఫోటోలు వేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఎంపీ మార్గాని భరత్  ఫోటో వేయలేదు. శిలాఫలకంపై కూడ ఆయన పేరును చేర్చలేదని ఎంపీ అనుచరులు ఆరోపించారు.

ఈ విషయమై ఎంపీ అనుచరులు ప్రారంభోత్సవ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో శిలాఫలాకాన్ని అధికారులు దాచేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీ భరత్  టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా  ఎంపీ అనుచరుల నిరసనతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అధికారుల తీరుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యేల పేర్లు వేసి ఎంపీ పేరును ఎందుకు వేయలేదో చెప్పాలని ఆయన అధికారులను ప్రశ్నించారు.