ys jagan mohan reddy: విశాఖ రైల్వేజోన్ సహా విభజన అంశాలపై కేంద్రీకరించాలి
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21న న్యూఢిల్లీలో జరగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర సమస్యలను ప్రస్తావించాలని జగన్ అధికారులను ఆదేశించారు.
అమరావతి:విశాఖ రైల్వే జోన్‌అంశంపై కూడా దృష్టిపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను కోరారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై ఈ నెల 21న కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి అధికారులు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులతో ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారంనాడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.
రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని ఏపీ సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయన్నారు.ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. అప్పుల్లో 58శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెవిన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు, 42 శాతం ఏపీకి వచ్చిందని సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించారు. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయన్నారు.
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని ఆయన చెప్పారు. పోలవరానికి నిధుల రాకలో సమస్యలున్నాయన్నారు.తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
హైదరాబాద్ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్ధల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కోల్పోయామన్నారు.విభజన చట్టంలో ఉన్న ఈ స్ఫూర్తి ఇప్పుడు అమల్లోకూడా కనిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించామని చెప్పారు.ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత అని సీఎం తెలిపారు.
మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం హై స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు.
విశాఖపట్నం వయా కర్నూలు మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తామని ఇచ్చిన అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు జగన్.విశాఖ మెట్రో రైలు అంశాన్నికూడా కొలిక్కి తీసుకురావాలని జగన్ అధికారులను కోరారు.