విజయవాడ: భర్తపై కోపంతో అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనపెట్టుకుంది ఓ కసాయి తల్లి. కన్న కొడుకని కూడా చూడకుండా ఆరు నెలల పసికందుకు డ్రైనేజీలో విసిరేసి అతి కిరాతకంగా హతమార్చింది. అమ్మతనానికే కలంకం తీసుకువచ్చే ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... విజయవాడలోని కామినేనినగర్ లో జయరాం-మీనాక్షి దంపతులు ఆరు నెలల కొడుకుతో కలిసి నివాసముంటున్నారు. అయితే భార్య మీనాక్షిపై అనుమానం పెంచుకున్న భర్త నిత్యం వేధించేవాడు. మద్యం, గంజాయికి బానిసయిన అతడు ఈ మత్తులో భార్యను చితకబాదేవాడు. 

read more  చెట్టుకు వేలాడిన బాలిక శవం.. బీజేపీ నేత కుమార్తెపై అత్యాచారం..?

భర్త చేష్టలతో విసిగిపోయిన ఆమె దారుణానికి పాల్పడింది. బుధవారం కూడా భర్తతో గొడవ జరగడంతో మీనాక్షి తన బిడ్డను తీసుకుని బయటకు వెళ్ళింది. భర్తపై కోపంతో రగిలిపోయిన ఆమె ఆ ప్రతాపాన్ని ఆరునెలల పసికందుపై చూపించింది. తల్లి ప్రేమను మరిచి ముక్కుపచ్చలారని చిన్నారిని కాలనీ పక్కనే ఉన్న గుంటతిప్ప డ్రైనేజీలో పడేసింది. 

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు చిన్నారికోసం డ్రైనేజీలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే పసికందు ఊపిరాడక చనిపోయాడు. దీంతో సామ్యేలు మృతదేహాన్ని బయటకు తీసిన స్థానికులు విషయాన్ని పటమట పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం జయరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు మీనాక్షిని అదుపులోకి తీసుకున్నారు.