పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నప్పటికీ ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. భేటీ పడావో... భేటీ బచావో అని ప్రభుత్వాలు సైతం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో ఓ అమ్మ, అమ్మమ్మ, ముత్తమ్మలు కలిసి శిశువును చంపేశారు.

వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామానికి చెందిన కాళ్ల సతీష్, అదే గ్రామానికి సృజన దంపతులకు గతేడాది 2019 మే నెలలో వివాహమైంది.

ఈ క్రమంలో సృజన గర్భం దాల్చి, నెలలు నిండటంతో భర్త సతీష్ ఆమెను రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించగా ఈ నెల 4వ తేదీన ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం పుట్టింటికి చేరుకున్న సృజనకు తన తల్లి మహాలక్ష్మీ నుంచి నిరాదరణ ఎదురైంది.

ఆడపిల్లకు జన్మనిచ్చావని కన్నకూతురిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇదే సమయంలో సృజన అమ్మమ్మ గంధం కనకరత్నం కూడా ఇలాగే ప్రవర్తిస్తోందది. మూడు తరాలుగా వంశంలో ఆడపిల్లలు పుట్టడం బాగోలేదని, ఆడబిడ్డ భారమని పెరిగే కొద్దీ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కసి పెంచుకుంది. మునిమనవరాలిని కడతేర్చాలని నిర్ణయించింది.

దీనిలో భాగంగా ఈ నెల 18వ తేదీన కనకరత్నం, మహాలక్ష్మీ అర్థరాత్రి 12.30 గంటల సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉన్న బావిలో ఆడశిశువును హత్య చేసి పడేశారు. ఆ తర్వాత ఏమి తెలియనట్లుగా బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారని కేకలు వేశారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో.. కోరుకోండ పోలీసులు రంగంలోకి దిగి, శిశువు కోసం గాలించారు. శిశువు కిడ్నాప్ వార్త గ్రామంలో దావానంలా వ్యాపించడంతో గ్రామస్తులు సైతం చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఓ పాడుబడ్డ బావిలో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసుల దర్యాప్తులో శిశువును ఆమె తల్లి సృజన, అమ్మమ్మ మహాలక్ష్మీ, ముత్తమ్మమ్మ కనకరత్నమే హత్య చేశారని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఆదివారం వీరి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా ముందు హాజరుపరిచారు.