కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో దారుణం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ తల్లి తన కొడుకుతో కలిసి ప్రాణత్యాగానికి పాల్పడింది. ఈ విషాద ఘటన సాక్షి గణపతి ఆలయంలో జరిగింది.

శ్రీశైలం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట పట్టణానికి చెందిన మాధవి(40), కొడుకు కార్తీక్(20) లు పది రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఈ నెల 4వ తేదీన వీరిద్దరు ఇంట్లోనుండి వెళ్లిపోయారు. అయితే కుటుంబ సభ్యులు ఎంత వెతికినా వీరి ఆచూకీ లభించలేదు. దీంతో  స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు.

అయితే ఇవాళ వీరు తమ కుటుంబ సభ్యులకు శ్రీశైలంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సమాచారం అందించారు. తమ చావుకు ఎవరూ కారణం  కాదని...క్యాన్సర్ తో బాధపడుతూ బ్రతకలేకే ఇలా దైవసన్నిధిలో ప్రాణత్యాగానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. తమ ఆత్మహత్యలను ఆపడానికి ప్రయత్నించిన ఫలితం వుండదని తెలియజేశారు. 

 ఈ సమాచారంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యే లోపు తల్లీ కొడుకులు పబలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీశైలంలోని సాక్షి  గణపతి దేవాలయ పరిసరాల్లో పురుగుల మందు తాగి ప్రాణాలను వదిలారు. 

జంట ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న స్థానికి పోలీసులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముందే సమాచారం వుండటంతో కుటుంబ సభ్యులు శ్రీశైలానికి చేరుకుని తమవారి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.