సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్ బాబుకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి అప్పగించనున్నట్లు మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. ఏపీ ఎన్నికల ముందు మోహన్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలోనూ మోహన్ బాబు చురుకుగా పాల్గొన్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ భారీ మెజార్టీ సాధించింది. దీంతో.. అప్పటి నుంచి మోహన్ బాబు కీలక పదవి దక్కబోతోందంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. 

మొన్నటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను మోహన్‌ బాబు ఖండించారు. తాజాగా మోహన్‌ బాబును ఎఫ్‌డీసీ (ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) చైర్మన్‌గా నియమించారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

కాగా దీనిపై మోహన్ బాబు పీఆర్ టీం స్పందించారు. అవన్నీ పుకార్లేనని... ఆ వార్తలు నమ్మవద్దని సూచించారు. గతంలో రూమర్స్ వచ్చినప్పుడు కూడా మోహన్ బాబు స్పందించారు. తాను ఎలాంటి పదవులు ఆశించడలేదని స్పష్టం చేశారు. అయినా ఈ రూమర్స్ కి మాత్రం ముగింపు పడటం లేదు.