న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ గవర్నర్ నరసింహన్ ను అడిగినట్లు తెలుస్తోంది. ఆయన పాదయాత్ర ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందనే విషయంపై ప్రధాని ఆసక్తి ప్రదర్శించినట్లు చెబుతున్నారు. 

గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోడీని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై, శాంతిభద్రతలపై గవర్నర్ ప్రధానికి వివరించినట్లు చెబుతున్నారు. 

లోకసభ ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ ప్రధానిని, కేంద్ర హోం మంత్రిని కలవడం ప్రాధాన్యతను సంతరించకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపితో తెగదెంపులు చేసుకున్న తర్వాత మోడీ కోసం జగన్ పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.