మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అని తెలుస్తోంది. ఇటీవలే అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు అతికిరాతకంగా దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. కాగా.. మావోల తదుపరి జాబితాలో ఉన్నవారికి భద్రత పెంచారు. 

ఇందులో భాగంగానే..గిడ్డి ఈశ్వరి సోమవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ చింతపల్లి మండలంలో పర్యటించారు. ఇప్పటికే ఆమెకు భారీ భద్రత పెంచారు. ప్రజాప్రతినిధిని అయిన తాను ప్రజల వద్దకు వెళ్లకుండా ఎలా ఉండగలనని, తాను మావోయిస్టుల టార్గెట్‌లోలేనని ఆమె పోలీసు అధికారులకు చెప్పినట్టు తెలిసింది. తనకు అసాధారణ భద్రత అవసరంలేదని చెబుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం ఆమె భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
సోమవారం చింతపల్లి మండలం బైలుకించంగి గ్రామంలో పర్యటించారు. అంతకుముందు జి.మాడుగులలో కూడా పర్యటించారు. జి.మాడుగుల నుంచి చింతపల్లి చేరుకునే మార్గంలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఐదు బాంబ్‌స్క్వాడ్‌ బృందాలు రహదారి, సభాప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. సభా ప్రాంగణానికి చుట్టూ సుమారు రెండు కిలోమీటర్ల పరిధిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభా వేదిక పక్కనున్న వాటర్‌ ట్యాంకుపై సాయుధ పోలీసులు పహారా కాస్తూ కనిపించారు.