Asianet News TeluguAsianet News Telugu

''కొత్తబిచ్చగాడు పొద్దెరగడు''అన్నట్లుగా: బడ్జెట్ పై ఎమ్మెల్సీ జనార్ధన్ కామెంట్స్

గత ప్రభుత్వాల పెండింగ్ బిల్లులు చెల్లించడం ఏ ప్రభుత్వానికైనా సామాన్యమేనని...ఇదేదో ఇప్పుడే వైసిపి ప్రభుత్వం కొత్తగా చేసినట్లు చెప్పడం వైసిపి దివాలాకోరుతనానికి నిదర్శమని టిడిపి ఎమ్మెల్సీ టిడి జనార్దన్ మండిపడ్డారు.

MLC TD Janardhan Rao Shocking Comments AP Budget
Author
Amaravathi, First Published Jun 17, 2020, 11:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: గత ప్రభుత్వాల పెండింగ్ బిల్లులు చెల్లించడం ఏ ప్రభుత్వానికైనా సామాన్యమేనని... ఇదేదో ఇప్పుడే వైసిపి ప్రభుత్వం కొత్తగా చేసినట్లు చెప్పడం వైసిపి దివాలాకోరుతనానికి నిదర్శమని టిడిపి ఎమ్మెల్సీ టిడి జనార్దన్ మండిపడ్డారు. ప్రభుత్వానికి మీరు కొత్తేమో గాని, పద్దతులు తెలుసుకుని మాట్లాడటం మంచిదని హెచ్చరించారు.  

''2014లో పెండింగ్ బిల్లులు రూ32వేల కోట్లు ఉన్నాయి. విభజన వల్ల రూ16వేల కోట్ల ఆర్ధికలోటు ఉంది. అప్పుడున్న సునామీతో పోలిస్తే ఇప్పుడేమి సునామీ ఉంది..? మీకు చేతగాక ఎదుటివాళ్లపై పడి ఏడవడం మానండి.2008-2014 పారిశ్రామిక బకాయిలు రూ 3,100 కోట్లు టిడిపి ప్రభుత్వం చెల్లించింది. మీ తండ్రి పెట్టిన పెండింగ్ బిల్లులు కూడా టిడిపి ప్రభుత్వం చెల్లించింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ 3,700కోట్లు చెల్లించాం'' అని తెలిపారు. 

''గత ప్రభుత్వాల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలు, వైద్య బిల్లుల బకాయిలు, సున్నావడ్డీ బకాయిలు తర్వాత ప్రభుత్వాలు చెల్లించడం సాధారణమే. టిడిపి హయాంలో బకాయిలు తామే చెల్లించినట్లు వైసిపి చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ‘‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’’ అన్నట్లుగా వైసిపి ధోరణి ఉంది'' అని ఘాటు విమర్శలు చేశారు. 

''అధికారం వైసిపికి కొత్తేమో గాని టిడిపికి కొత్తకాదు. 38ఏళ్ల పార్టీ చరిత్రలో 22ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ టిడిపి. ఆదాయంతో పాటు పెండింగ్ బిల్లులు సంక్రమించడం సర్వసాధారణం. గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు రూ 32వేల కోట్లు టిడిపి ప్రభుత్వానికి వారసత్వంగా సంక్రమించాయి. దీనికి తోడు రాష్ట్ర విభజన వల్ల మరో రూ16వేల కోట్ల ఆర్ధికలోటు భారం టిడిపి ప్రభుత్వంపై పడింది. అంటే మొత్తం రూ48వేల కోట్ల భారం తొలిఏడాదే పడినా టిడిపి ప్రభుత్వం సమర్ధంగా ఆర్ధిక  పరిస్థితి చక్కదిద్దింది'' అని పేర్కొన్నారు. 

read more   సీఆర్‌డీఏ రద్దు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు చర్చించొద్దు: మండలి ఛైర్మెన్ షరీఫ్ కు టీడీపీ నోటీసు

''కానీ వైసిపి ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన పెండింగ్ బిల్లులపై అంకెల గారడి చేస్తోంది. మొదట రూ.30వేల కోట్ల బిల్లులు అన్నారు, తర్వాత రూ.40వేల కోట్లు అన్నారు, ఇప్పుడు రూ.60వేల కోట్ల బిల్లులు అంటున్నారు. నోటికి హద్దు అదుపు లేకుండా అబద్దాలు చెబుతున్నారు'' అని మండిపడ్డారు. 

''సునామీలా పెండింగ్ బిల్లుల భారం వైసిపి ప్రభుత్వంపై పడిందని మంత్రి పిల్లి సుభాస్ చంద్ర బోస్ అనడం హాస్యాస్పదం. మీరు చెప్పే సునామీ ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదని తెలుసుకోవాలి. ప్రతి ప్రభుత్వానికి తొలి ఏడాది వచ్చే పెండింగ్ బిల్లుల భారాన్నే సునామీ అనుకుంటే రూ 16వేల కోట్ల ఆర్ధికలోటు అదనపు భారాన్ని ఏ సునామీ అనాలో సుభాస్ చంద్రబోస్ గారే చెప్పాలి. మీ వైఫల్యాలకు కారణం చేతగాని తనం, అవినీతే. ఆ నిందలు పొరుగు వాళ్ల మీద మోపడం భావ్యం కాదు'' అంటూ విరుచుకుపడ్డారు.

''టిడిపి ఎంత సమర్ధంగా ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దిందో ఒక్కసారి చూసుకోండి లేదా అధికారులను అడిగి తెలుసుకోండి. టిడిపి ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం రూ 85,797 నుంచి రూ1,69,519కు పెంచాం. 5ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు చేశాం. కొనుగోలు శక్తి పెంచాం, పొదుపు శక్తి పెంచాం కాబట్టే తలసరి ఆదాయం పెంపు సాధ్యమైంది. జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి'' అని వివరించారు. 

''టిడిపి హయాంలో రాష్ట్ర బడ్జెట్ ను రూ 1,11,823కోట్ల నుంచి రూ2,27,975కోట్లకు పెంచాం. 5ఏళ్లలో మొత్తం బడ్జెట్ రూ 1,16, 152కోట్లు అదనంగా పెంచాం. కేపిటల్ ఎక్స్ పెండిచర్ రూ 7,069కోట్ల నుంచి రూ 29,596కోట్లకు పెంచాం. నాలుగు రెట్లకంటె ఎక్కువ మూలధన వ్యయం చేశాం. నీటిపారుదల ప్రాజెక్టులు, సిమెంట్ రోడ్లు, ఇళ్లు పెద్దఎత్తున నిర్మించాం'' అన్నారు.

''టిడిపి హయాంలో ఏడాదికి సగటున రూ26వేల కోట్లు అప్పులు చేస్తే వైసిపి ప్రభుత్వం ఏడాదిలోనే 87వేల కోట్ల అప్పులు చేశారు. ఇంత అప్పు చేసికూడా ఏ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క రోడ్డు వేయలేదు. దీనిపై ప్రజలు నిలదీస్తారనే మీ వైఫల్యాలను టిడిపిపై నెట్టి తప్పించుకోవాలని చూడటం హేయం'' అని టిడిపి ఎమ్మెల్సీ టిడి. జనార్దన్ రావు మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios