రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు ఓ చరిత్ర అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకుంటుంటే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం అవన్నీ వట్టి బిల్డప్ లేనంటూ కొట్టిపారేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తానేనని గ్యాలరీ వాక్ చేసింది తానేని చంద్రబాబు నాయుడు చెప్తుంటే పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు చేసినన్ని శంకుస్థాపనలు ఎవరూ చెయ్యలేరని మండిపడ్డారు. 

పోలవరం ప్రాజెక్టు దగ్గర సీఎం చంద్రబాబు నాయుడు చేసినన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా చేసి ఉండరని   వీర్రాజు ఆరోపించారు. ప్రధాని మోడీని ఆడిపోసుకోనిదే చంద్రబాబుకు పొద్దు గడవదని ఎద్దేవా చేశారు. మరోవైపు పెట్రోల్ పై పక్క రాష్ట్రాల కంటే రూ.6 ఎక్కువ పన్ను వసూలు చేస్తున్న చంద్రబాబు రూ.2 తగ్గించి తానేదో త్యాగాలు చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆరోపించారు. 

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఫ్లెక్సీ పెట్టినా మొదట ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల ఫోటోల తర్వాతే చంద్రబాబు ఫోటో పెట్టుకోవాలని సూచించారు. 100కు పైగా పథకాలు కేంద్రం ఆర్థిక సాయంతోనే నడుస్తుంటే కేంద్రప్రభుత్వం సాయం చెయ్యడం లేదని చెప్పడం విచారకరమని సోము వీర్రాజు అన్నారు.