అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలను ఘోరంగా దెబ్బతీశాయి. ఈ ఎన్నికల్లో గెలుస్తామనే వారి అతి నమ్మకం వారిని ఘోరంగా దెబ్బతీసింది. 

అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి అన్న చందంగా వారొకటి తలస్తే ఓటరు మరోకటి తలిచారు. దాంతో వారి పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారింది. తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని కూడా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా హల్ చల్ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 

అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేపల్లి టికెట్ ఇవ్వడంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎలాగైనా తానే గెలుస్తానని నమ్మకం ఏర్పడిపోయింది. అంతే వెంటనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. 

ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. వరుసగా ఐదోసారి ఓడిపోయారు సోమిరెడ్డి. ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు సోమిరెడ్డి. ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో రెండింటికి చెడ్డ రేవడిలా అయ్యింది సోమిరెడ్డి పరిస్థితి. 

ఇకపోతే రామసుబ్బారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణ రెడ్డితో నెలకొన్న విభేదాల కారణంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి రాజీ కుదిర్చారు చంద్రబాబు. అయితే ఈసారి జమ్మలమడుగు టికెట్ దక్కించుకోవాలన్న ఆశతో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవిని సైతం తృణపాయంగా వదిలేశారు. 
జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఇస్తే ఎమ్మెల్సీ పదవిని వదిలేస్తానని రాజీకి రావడంతో చంద్రబాబు ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. 

అంతేకాదు ఒప్పందంలో భాగంగా రామసుబ్బారెడ్డి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవిని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు శివనాథరెడ్డికి ఇప్పించుకున్నారు. ఆదినారాయణ రెడ్డి కడప పార్లమెంట్ నుంచి ఘోరంగా ఓటమిపాలైతే రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి దారుణంగా ఓటమి పాలయ్యారు. 

జమ్మలమడుగు టికెట్ కోసం ఎమ్మెల్సీ పదవిని సైతం వదులుకుని ఎన్నికల సమరంలో దిగిన రామసుబ్బారెడ్డికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దీంతో అటు ఎమ్మెల్సీ పోయే ఇటు ఎమ్మెల్యే కాకుండా పోయే రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది రామసుబ్బారెడ్డి పరిస్థితి మరి వారి భవిష్యత్ కార్యచరణ ఎలా ఉంటుందో ఏంటో అన్నది వేచి చూడాలి.