తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ తదితరులపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ స్వార్థం కోసం, వ్యాపార లావాదేవీల కోసమే వారు బీజేపీలో చేరారని ఆరోపించారు.

ఈ నాయకులే త్వరలో విజయసాయిరెడ్డి దగ్గరకు వెళతారని బుద్దా మండిపడ్డారు. గుండెల్లో ధైర్యం, రక్తంలో నిజాయితీ లేని దద్దమమ్మలు అంటూ బుద్ధా ధ్వజమెత్తారు. సుజనా, రమేశ్, గరికపాటికి చంద్రబాబు పదవులు ఇచ్చారని.. ఎన్నికల్లో గెలవలేకపోయినా పదవులు ఇచ్చి గౌరవించారని వెంకన్న గుర్తు చేశారు.

వాళ్లకు రక్తంలో నిజాయితీ లేదని.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారా అని ఆయన ప్రశ్నించారు. ఉన్న పార్టీని గెలిపించుకునే సత్తా వీళ్లకు లేదని.. రేపు బీజేపీ ఓడిపోతే ఏ పార్టీలోకి వెళతారని వెంకన్న నిలదీశారు.

వీరిని ఏపీలో తిరగనివ్వకూడదని.. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని.. కేసులు మాఫీ చేసుకునేందుకే బీజేపీలోకి వెళ్లారని, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకే కాషాయ కండువాలు కప్పుకున్నారని వెంకన్న ఆరోపించారు. పార్టీ మారిన నేతలు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని బుద్ధా హెచ్చరించారు.