Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్ : ఎమ్మెల్సీ అనంతబాబుపై వేటు.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ

ఇటీవల మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో వున్న ఎమ్మెల్సీ అనంత బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. 

mlc ananthababu suspended from ysrcp
Author
Amaravati, First Published May 25, 2022, 6:53 PM IST

ఇటీవల మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో వున్న ఎమ్మెల్సీ అనంత బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. 

కాగా.. మాజీ కార్ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అంగీకరించినట్లు కాకినాడ జిల్లా ఎస్ పి ఎం రవీంద్రనాథ్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక విచారణ,  అనంత బాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి ప్రాథమిక దర్యాప్తులో ఆయనను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడిని కాకినాడ స్పెషల్ మొబైల్ జేఎఫ్ సీఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, రిమాండ్ కు పంపించామని తెలిపారు. సోమవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ శ్రీనివాస్ తో కలిపి ఎస్పీ మీడియాతో మాట్లాడారు. విచారణ కొనసాగుతోందని, హత్య కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఏమైనా జరిగిందా? అన్న విషయంపై దర్యాప్తు కొనసాగిస్తామన్నారు.

ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు పర్యవేక్షణలో ఆరు బృందాలను ఏర్పాటు చేసి, వేగంగా దర్యాప్తు జరిపి, ఎమ్మెల్సీని అరెస్టు చేసినట్లు చెప్పారు. డీజీపీ గంటగంటకు కేసును పర్యవేక్షించారనీ.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారని వెల్లడించారు.. వివరాలు ఇవి…

ఎమ్మెల్సీ అహం దెబ్బతిన్నది..
సంఘటన జరిగిన రోజు (19) సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో బయటికి వచ్చాడు. మిత్రులతో కలిసి మద్యం కొన్నాడు. శ్రీరామ్ నగర్ ఏరియాలో ఓల్డ్ నవభారత్ స్కూల్ ప్రాంగణంలో రాత్రి 10:15 వరకు మద్యం తాగారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చేసరికి అదే సమయంలో ఎమ్మెల్సీ అనంత బాబు తన కారులో అటుగా వచ్చారు. సుబ్బును పిలిచి వాహనంలోకి ఎక్కించుకున్నారు. మిగితా మిత్రులు వెళ్లిపోయారు. అదే వాహనంలో ముందుకు వెళ్లి టిఫిన్ కట్టించుకుని.. 10:30 సమయంలో తిరిగి ఎమ్మెల్సీ నివాసం వైపు వెళ్లారు. నీ పెళ్లి సమయంలో ఇచ్చిన అప్పు ఇంకా రూ.20,000 తిరిగి ఇవ్వలేదని ఆనంతబాబు అడగటంతో ఇచ్చేస్తానని సుబ్రహ్మణ్యం చెప్పాడు.

‘నువ్వు ప్రవర్తన మార్చుకుని బాగుంటే నా దగ్గర పనిలో పెట్టుకోమని మీ అమ్మ అడుగుతోంది. నీ దగ్గర మద్యం వాసన వస్తుంది. నీలో మార్పు రాలేదు’ అని ఎమ్మెల్సీ అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటి వద్ద కారు ఆగి దిగాక..  నీ పద్ధతి బాగా లేదంటూ కొట్టడానికి అనంత బాబు ముందుకు వస్తే..  తాగిన వ్యక్తిని ఎందుకు కొడతావు అని సుబ్రమణ్యం ఎదురుతిరిగాడు.  దీంతో  అనంతబాబు అహం దెబ్బతిని మెడ పట్టుకుని వెనక్కి నెట్టాడు. 
ఆ వేగానికి సుబ్రమణ్యం అపార్ట్మెంట్ డ్రైనేజీ గట్టుపై పడటంతో తలకు గాయమైంది. ‘నన్నే కొడతావా’.. అని కోపంతో అతను మళ్ళీ  తిట్టడంతో  అనంత బాబు రెండోసారి బలంగా కొట్టాడు. దీంతో గ్రిల్స్ కు తగిలి తలకు మళ్లీ గాయమైంది. అనంత బాబు అతడిని వాహనంలో ఎక్కించుకుని 2 ఆస్పత్రులకు తిరిగాడు. కానీ అవి మూసి వేసి ఉన్నాయి.  కారులో వస్తుండగా సుబ్రమణ్యానికి ఎక్కిళ్లు రావడంతో అనంత బాబు నీళ్లు ఇచ్చాడు. అది తాగాక కొంతసేపటికి ఉలుకూ పలుకూ లేకపోవడంతో పరీక్షించగా శ్వాస ఆగిపోయింది అని గుర్తించాడు. చనిపోయాడని భావించి ఆ షాక్ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాడు.

ప్రమాదంగా చిత్రీకరించాలని..
సుబ్రహ్మణ్యం తాగి, నాలుగైదు సార్లు ప్రమాదాలు చేశాడు. తాగిన ప్రతిసారి యాక్సిడెంట్  చేస్తే..  ఆస్పత్రుల్లో చికిత్స చేయించి,  కుటుంబానికి అప్పగించేవారు. దీన్ని కూడా అలాగే ప్రమాదం సృష్టిస్తే అనుమానం రాదని అనంత బాబు భావించాడు. స్థానిక జీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించాలని చూశాడు.. అక్కడ ట్రాఫిక్ ఉండడంతో డంపింగ్ యార్డ్ ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ సుబ్రమణ్యం మృతదేహాన్ని కింద పడుకోబెట్టి ప్రమాదంలో గాయపడినట్లు చూపడానికి.. చెట్టుకొమ్మతో తొడలు, భుజం, వీపుపైన కొట్టాడు.

తర్వాత మృతదేహాన్ని అక్కడున్న తాడుతో కట్టేసి వాహనంలో ఎక్కించాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చి 12:30 ప్రాంతంలో మృతుడి తల్లికి ఫోన్ చేసి ప్రమాదం జరిగినట్టు నాకు సమాచారం వచ్చింది.. నేను అక్కడికి వెళ్తున్నాను... అని నమ్మబలికాడు. కాసేపటికి మళ్ళీ వారికి కాల్ చేసి, నేను మృతదేహాన్ని తీసుకు వస్తున్నాను అని చెప్పాడు.  ఇంటికి రాగానే మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అది ప్రమాదం కాదని అనుమానించారు. ఎమ్మెల్సీని నిలదీయడంతో ఆయన కారు వదిలి వేరే ద్విచక్రవాహనంపై అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్పీ వివరించారు.

ఆధారాలు తారుమారు చేసే ప్రయత్నంలో మృతదేహంపై  గాయాలు చేయడం, హత్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద సెక్షన్లు మార్చి అనంత బాబును అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. అవసరమైతే మరోసారి పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు. రూ. 20 వేల కోసమే హత్య చేశాడా? వివాహేతర సంబంధాల నేపథ్యమా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు వాస్తవాల ప్రకారమే దర్యాప్తు ఉంటుందని ఇది ఫైనల్ కాదని సమాధానం ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios