అమరావతి : ఏపీ అసెంబ్లీలో రాజీనామాల ఆమోదంపై ఆసక్తికర చర్చ జరిగింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో మంత్రి అచెన్నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. 

ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేశారో సమాధానం చెప్పాలని విష్ణుకుమార్‌ రాజును మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కౌంటర్ వేశారు. 

ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే సరిపోదని విష్ణుకుమార్‌ రాజు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు పంపడంలేదని ప్రజలు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. 

ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలుసునని స్పష్టం చేశారు. అందుకే యనమల రామకృష్ణుడు నల్ల చొక్కా ధరించలేదని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఉద్యమాన్ని తీవ్రం చేశారని గ్రహించిన టీడీపీ యూ టర్న్ తీసుకుంందని ఎద్దేవా చేశారు. 

మొన్నటివరకు జగన్‌, పవన్‌, బీజేపీ ఒకటి అని విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మళ్లీ పవన్‌ కళ్యాణ్ పై ప్రేమ కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మిత్ర ద్రోహం చేసిన పార్టీ బీజేపీ కాదని తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు.