గుంటూరు: తనకు ఇద్దరు వ్యక్తుల నుంచి ప్రాణ హాని ఉందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడికొండ నియోజకవర్గానికి చెందన శృంగారపాటి సందీప్, చలివేంద్రపు సురేష్ తనను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సందీప్, సురేష్ అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ పేకాట ఆడిస్తూ పెదకాకాని పోలీసులకు చిక్కారు. దాంతో మండల పార్టీ నాయకులు వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. తానే అధిష్టానానికి చెప్పానని భావించి కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని శ్రీదేవి అన్నారు. 

తన గొంతు మార్ఫింగ్ చేసి మాట్లాడుతూ తనను అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను బయటకు వెళ్లినప్పుడు వెంటపడుతూ ప్రాణహాని తలపెట్టేలా ఉన్నారని ఆమె చెపపారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. 

ఎమ్మెల్యే శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జున రావు చెప్పారు.