వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకున్న కోరిక నెరవేరిందని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ  ఛైర్మన్ వైసీపీ రోజా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే రోజా విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్నారు.

శనివారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి దర్శనార్థం రోజా వచ్చారు. ఈ సందర్భంగా సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గతేడాది ఇదే రోజు జగన్ ని సీఎం చేయాలని తాను కోరుకున్నట్లు గుర్తు చేశారు. సరిగ్గా ఇదే రోజు తాను అమ్మవారి దర్శనానికి వచ్చానని... జగన్ ముఖ్యమంత్రి చేయమని కోరుకున్నానని చెప్పారు.

తన కోరికను అమ్మవారు నెరవేర్చారని రోజా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం సీఎం జగన్ కి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలందరూ ఎంతో ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

ఇదిలా ఉండగా... ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రోజా నగరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ జగన్ ఆమెకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. కాగా... ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని కట్టపెట్టారు. ఒకవైపు జబర్దస్త్ లాంటి షోలు చేసుకుంటూనే.. మరోవైపు ఏపీఐఐసీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు నియోజకవర్గంలోనూ ఆమె చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రోజా జిమ్ లో రచ్చ రచ్చ చేశారు. ఒక రూమ్ లో జిమ్ వర్కవుట్ చేయాల్సిన రోజా పబ్లిక్ గా వర్కవుట్ చేస్తూ హల్ చల్ చేశారు. రోజా జిమ్ చేస్తున్న సమయంలో కార్యకర్తలు, అభిమానులు విజిల్స్ తో జిమ్ ను హోరెత్తించారు.