టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు, శవ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కరోనాతో తిరుపతి ఎంపీ చనిపోతే సంప్రదాయాలకు విరుద్ధంగా..చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారని మండిపడ్డారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. స్థానిక ఎన్నికలు పెట్టాలని బాబు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. తన సామాజికవర్గం వ్యక్తి అయిన ఎస్‌ఈసీ మార్చిలో రిటైర్‌ అవుతుండడంతో.. ఆ లోపే ఎన్నికలు జరపాలని చంద్రబాబు కలలు కంటున్నారని రోజా పేర్కొన్నారు. 

కాగా.. ఇటీవల కరోనాతో  తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు. కాగా.. ఆయన చనిపోవడంతో.. ఆ స్థానం ఇప్పుడు ఖాళీ అయ్యింది. దీంతో.. ఆ స్థానానికి తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తమ పార్టీ నుంచి అభ్యర్థి పేరును ప్రకటించారు. కాగా.. దీనిపై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఎన్నికలు జరిపించడానికి చంద్రబాబు తొందరపడుతున్నాడని ఆమె ఆరోపించారు.