Asianet News TeluguAsianet News Telugu

23-3-2023 న 23 ఓట్లతో టిడిపి గెలుపు... ఇది కదా దేవుడి స్క్రిప్ట్..:జగన్ కు పయ్యావుల కౌంటర్ (వీడియో)

ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయంతో మంచి జోరుమీదున్న టిడిపికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ విజయం మరింత జోష్ నింపింది. 

MLA Payyavula Keshav reacts on TDP  win in MLC Election AKP
Author
First Published Mar 24, 2023, 10:11 AM IST

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నయా జోష్ నింపాయి. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయం, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ విజయంతో టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.టిడిపికి బలం లేకున్నా అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను బరిలోకి దింపుతూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. అయితే ఇది ఆశామాశీ నిర్ణయం కాదని... తన రాజకీయ అనుభవంతో వైసిపిని చిత్తుచేసే ఎత్తుగడ అని తాజాగా అర్థమయ్యింది.వైసిపి ప్రభుత్వం, అదిష్టానంపై అసంతృప్తిగా వున్న ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడతారని పసిగట్టే చంద్రబాబు టిడిపి అభ్యర్థిని బరిలోకి దింపారు. అనుకున్నట్లే క్రాస్ ఓటింగ్ జరిగి అనురాధ అద్భుత విజయాన్ని అందుకున్నారు. 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో మంచి ఊపుమీదున్న టిడిపికి తాజా విజయం మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. గెలిచింది ఒకే ఎమ్మెల్సీ... కానీ ఇది అధికార వైసిపిలో అలజడిని, ప్రతిపక్ష టిడిపిలో జోష్ ను పెంచింది. తన అభ్యర్థిత్వం ఖరారు నుండి విజయం వరకు జరిగిన పరిణామలను గుర్తుచేసుకుంటూ విజేత పంచుమర్తి అనురాధ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన గెలుపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు అంకితమని అన్నారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్సీగా బరిలోకి దింపి గెలింపించుకున్న చంద్రబాబు, లోకేష్ తో పాటు టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనురాధ. 

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం టిడిపి సీనియర్లు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడుతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి అనురాధ సంబరాలు జరుపుకున్నారు. భారీ టిడిపి జెండాతో ఏపీ అసెంబ్లీ బయట సందడి చేసారు. టిడిపి నాయకులు, కార్యకర్తల నినాదాల మధ్య అసెంబ్లీ నుండి కాలినడకన బయలుదేరారు అనురాధ. 

వీడియో

టిడిపి గెలుపుపై పయ్యావుల కేశవ్ స్పందిస్తూ.. . ఇది కదా అసలైన దేవుడి స్క్రిప్ట్ అంటూ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ చేసిన కామెంట్స్ కు అదే స్టైల్లో కౌంటరిచ్చారు. 3వ నెల 23వ తేదీ 2023 న 23 ఓట్లతో టిడిపి గెలిచింది... ఇదీ స్క్రిప్ట్ అంటే అని అన్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల షాక్ లో వున్న వైఎస్ జగన్, వైసిపి నాయకులకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే మరో షాక్ ఇచ్చారని అన్నారు. 23 ఓట్లతో టిడిపికి పట్టం కట్టిన ఎమ్మెల్యేలందరికీ పయ్యావుల ధన్యవాదాలు తెలిపారు. 

సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసిపి ప్రభుత్వాన్ని, జగన్ నాయకత్వాన్ని నమ్మడం లేదని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంతో తేలిపోయిందని పయ్యావుల అన్నారు. ప్రలోభాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వైసిపి సొంత ఎమ్మెల్యేల నమ్మకాన్ని పొందలేకపోయింది... ఎమ్మెల్యేలపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా వైసిపి ఓటమి తప్పలేదని అన్నారు. వరుస ఓటముల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రజలు, ప్రజాస్వామ్యం గుర్తుకువచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని పయ్యావుల అన్నారు. 

ఇక మరో టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో జగన్ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందని అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలే బాయ్ బాయ్ జగన్ అంటున్నారని ఎద్దేవా చేసారు, సొంత ఎమ్మెల్యేల విశ్వసనీయతే జగన్ కోల్పోయారు... అలాంటిది ఇక ప్రజలెలా నమ్ముతారని అన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రజలనే కాదు సొంత 
ఎమ్మేల్యేలను జగన్ భయపెట్టారని ఎమ్మెల్సీ ఫలితాలతో స్పష్టమవుతుందని అన్నారు. టిడిపి శ్రేణులు అహర్నిశలు కృషి ఫలితమే ఈ ఎమ్మెల్సీ విజయమని రామానాయుడు పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios