ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. అసలు చంద్రబాబుని కలవడానికి ఎవరైనా ఇష్టపడతారా అని ఆయన అన్నారు. చంద్రబాబు ఏమైనా అందగాడని, శోభన్ బాబులా  ఫీలౌతున్నాడా అని ప్రశ్నించారు.

శనివారం ఆయన విశాఖపట్నం లో విలేకరులతో మాట్లాడారు. జగన్ పై చంద్రబాబు చేసిన విమర్శలు అర్థరహితమన్నారు. జగన్ పాలనను పిచ్చోడి చేతిలో రాయి అంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ దారుణమన్నారు.  పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో బాబు పాలనలో జనాలు స్వయంగా అనుభవించారని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబును చూసి వైఎస్సార్‌ భయపడ్డారంటా.. గొప్పల కోసం బాబు మరి ఇంత దిగజారుతారనుకోలేదు అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత చంద్రబాబు సొంతంగా అధికారంలోకి వచ్చిన సందర్భం ఒక్కటైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు మతి పోయిందో.. మత్తెక్కి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు మందు అలవాటు లేదు.. కానీ ఓడిపోయిన తర్వాత ఏమైనా మారిపోయారా అంటూ అమర్‌నాథ్‌ అనుమానం వ్యక్తం చేశారు.

లోకేష్ భవిష్యత్తు గురించి చంద్రబాబు బాధపడుతున్నాడని.. అందుకే అలా మాట్లాడుతున్నాడని అన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఎవరికి ఏం దోచి పెడదామా అనే చంద్రబాబు ఆలోచించారని...  ఇప్పడు విశాఖపట్నంపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు.  

అప్పట్లో వైఎస్ హయాంలో విశాఖ అభివృద్ధి చెందిందని... మళ్లీ ఇప్పుడు జగన్ హయాంలో అభివృద్ధి జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఎమ్మార్వో వనజాక్షిని, చింతమనేని జుట్టుపట్టుకుని కొడితే.. చంద్రబాబే స్వయంగా సెటిల్‌ చేశారన్నారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో జగన్‌పై హత్యా ప్రయత్నం జరిగితే.. వైసీపీ నాయకులే చేయించారని చం‍ద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని మండి పడ్డారు.