ప్రజా వేదిక కూల్చివేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ  సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ప్రజావేదిక నిర్మాణం కూల్చివేస్తామనడం సరికాదన్నారు.  ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనమదని.. ప్రస్తుతం అది కోర్టు పరధిలో ఉందని చెప్పారు.

 గత 50 ఏళ్లలో ఆ ప్రాంతం ముంపునకు గురైన దాఖలాలు లేవని చెప్పారు.  కూల్చేస్తామని ప్రకటన చేసిన వ్యక్తి అక్కడే ఎందుకు కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసారు అని ప్రశ్నించారు. ఇది వైసీపీ ద్వంద వైఖరి ఇక్కడే బయటపడిందన్నారు. టీడీపీ మీద కక్ష సాధించేందుకే ఇవన్ని చేస్తున్నారని మండిపడ్డారు.

 కరకట్టపై అనేక కట్టడాలు ఉన్నాయని.. వాటన్నింటిని కూడా తొలగిస్తారా అని ప్రశ్నించారు.వైసీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకే గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపట్టారని మండిపడ్డారు.

అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కుంటోన్న జగన్ అవినీతి వ్యతిరేకమని ప్రకటనలు చేయడం హాస్యస్పదంగా ఉందని విమర్శలు గుప్పించారు. జగన్ 12 కేసుల్లో నిందితుడు 40 వేల కోట్లు ఈడీ సీజ్ చేసిందని.. ఆయన మంత్రివర్గంలో ఉన్న బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

అనంతరం రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడంపై కూడా ఆయన స్పందించారు. టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడం దారుణమన్నారు. ఇక పై వైట్ ఎలిఫెంట్ లకి టీడీపీలో  చోటు లేదని తేల్చి చెప్పారు.