అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును ఆదివారం మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన హత్య తనను షాక్ కి గురి చేసిందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. కిడారి మృతదేహానికి నివాళులర్పించిన ఆమె... ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కిడారి సర్వేశ్వరరావు తన కుటుంబసభ్యుడని.. తన పిన్ని కుమార్తెకు భర్త అని తెలిపారు. ఆయన మరణవార్త వినగానే కుటుంబసభ్యులమంతా దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు.

పాడేరులో తాను, అరకులో సర్వేశ్వరరావు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామని.. గిరిజన గ్రామాల్లో వందల కోట్ల నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఈశ్వరి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమమైన గ్రామదర్శినిలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న ఆయన్ని మావోయిస్టులు హతమార్చడం దారుణమన్నారు. 

తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఎక్కడికెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఇంతటి విషాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. బాక్సైట్‌ తవ్వకాలే ఈ హత్యకు కారణమని చెప్పలేమన్నారు. ఇటీవల అరకులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అరకులో బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టమని ప్రకటించారని ఆమె గుర్తుచేశారు. కిడారి హత్య జరిగిన వెంటనే పోలీసులు తనకు ఫోన్‌ చేసి సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించారని ఆమె తెలిపారు. తమకు హాని ఉందని చెప్పి ప్రజా క్షేత్రంలోకి వెళ్లకుండా ఉండలేమని ఆమె స్పష్టం చేశారు.