శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర జిల్లాలలో జనసేన పార్టీ కనీసం రెండు నుంచి మూడు స్థానాలు కైవసం చేసుకుంటుందని తెగ ప్రచారం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఖచ్చితంగా రెండు స్థానాలైన దక్కించుకుంటుందని ప్రచారం జోరుగా సాగింది. 

అయితే ఊహించని రీతిలో జనసేన పార్టీ రాష్ట్రంలోనే ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కూడా ఓటమి తప్పలేదు. దీంతో ఒక్కొక్కరుగా జనసేన పార్టీకి గుడ్ బై చెప్తూ వస్తున్నారు. తాజాగా వీరికోవలోకి మరో ఎమ్మెల్యే అభ్యర్థి చేరిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. 

శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కోత పూర్ణచంద్రరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్తారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో  కలిసి హంగామా చేయడం నిజమేనేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇకపోతే కోత పూర్ణచంద్రరావు పలాస నియోజకవర్గంలో టీడీపీలో  కీలక నేతగా వ్యవహరించారు. దాంతో కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ పదవి ఆయనను వరించింది. మున్సిపల్ చైర్మన్ గా ఏడాది కాలం పూర్తి చేసుకోకుండగానే స్థానిక ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీపై తిరుగుబాటుకు దిగారు. 

ఎమ్మెల్యేతో ఉన్న విబేధాల నేపథ్యంలో ఆయనపై పార్టీ సస్పెండ్ వేటు సైతం వేసింది. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తిరిగారు. వారితో మంచి సంబంధాలు నడిపారు. ఎన్నికలకు ముందు ఆకస్మాత్తుగా జనసేన పార్టీలో చేరిపోయారు. 

జనసేన పార్టీ అభ్యర్థిగా పలాస నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయితే పాత పరిచయాల నేపథ్యంలో పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుతో కలిసి పయనిస్తున్నారని ఆయన త్వరలో జనసేనకు గుడ్ బై చెప్తారనే ప్రచారం జరుగుతుంది.