టీడీపీ నేతలే మాపై దాడి చేశారు.. చంద్రబాబు కొడుకు కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెడతారా?: ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
వినుకొండలో టీడీపీ నేతలు అరాచకం, విధ్వంసం సృష్టించారని వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మండిపడ్డారు. టీడీపీ నాయకులే తమపై రాళ్ల దాడి చేశారని అన్నారు.

వినుకొండలో టీడీపీ నేతలు అరాచకం, విధ్వంసం సృష్టించారని వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మండిపడ్డారు. టీడీపీ నాయకులే తమపై రాళ్ల దాడి చేశారని అన్నారు. టీడీపీ రాజకీయ లబ్ది కోసమే వినుకొండలో విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. ‘‘నీ కొడుకు రాజకీయ లబ్దికోసం ప్రజల ప్రాణాలు పణంగా పెడతావా చంద్రబాబు’’ అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ప్రజల సొమ్మును కాజేసిన దొంగలు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తాను ప్రభుత్వ భూములు కాజేశనని నిరూపించాలని సవాలు విసిరారు. ఒక్క అంగుళం ప్రభుత్వం భూమి తన ఆధీనంలో ఉందని నిరూపిస్తే.. తన ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిస్తానని అన్నారు.
ఇదిలా ఉంటే, గురువారం రోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వైసీపీ, టీడీపీ వర్గాలకు చెందిన ఘర్షణలను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే జీవీ, టీడీపీ నేత ఆంజనేయులు, మరికొందరు బ్రహ్మనాయుడుకు చెందిన ఆస్తిని సందర్శించి అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయో లేదో తనిఖీ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితేఆంజనేయులుపై పెట్టిన కేసులను నిరసిస్తూ వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర టీడీపీ శ్రేణులు ధర్నా చేశారు.
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్రమ ఇసుక దందాకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు బ్రహ్మనాయుడు కారును అడ్డుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వాహనం దిగి తమ ఆరోపణలను నిరూపించాలని టీడీపీ నేతలకు సవాలు విసిరారు.
అనంతరం జీవీ ఆంజనేయులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరోపణలు రుజువు చేయాలని ఒకరికొకరు సవాల్ విసిరారు. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడికి దిగడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. ఇక, వినుకొండలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, పట్టణంలో రాజకీయ ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని.. మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.