టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుని తాను వదలనని  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా... ప్రజావేదిక కూల్చివేత పనులను ఆళ్ల రామకృష్ణ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రజా వేదిక కూల్చివేత పై జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్షంవ్యక్తం చేస్తున్నారని  చెప్పారు. కరకట్ట మీద 60కి పైగా ఖరీదైన భవనాలు ఉన్నాయని, వాటన్నిటికీ నోటీసులు ఇప్పించినట్లు తెలిపారు. ఈనెల 21న దీనికి సంబంధించిన కేసులు న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉండగా.. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్‌ చేశారని ఆరోపించారు.

 ప్రజావేదిక పక్కన ఉన్న ఇంట్లో చంద్రబాబు ఉండటం అన్యాయమని, ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా తక్షణమే ఖాళీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబును తాను వదిలిపెట్టనని స్పష్టం చేశారు. మిగిలిన వాళ్లు తామంతట తాము ఖాళీ చేస్తే మంచిదని, జగన్‌కి ఉన్న మంచి మనసును అంతా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.