ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఓ నిర్ణయానికి టీడీపీ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు. మంగళవారం బీఏసీ సమావేశంలో పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.. దానిని తాను స్వాగతిస్తున్నానని ఆయన చెప్పారు.

సభ్యుల సంఖ్యను బట్టి కాకుండా విపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం అనేక అంశాలను చర్చించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. దానిని తాము అడ్డురామని చెప్పారు. గురువారం ప్రశ్నోత్తరాల తర్వాత దీనిపై చర్చిస్తామని వెల్లడించారు.

 రాష్ట్రంలో పొలిటికల్ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కూడా చర్చకు డిమాండ్ చేశామన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం మంచిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాల్లో వాస్తవాలుంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. అలా కాకుండా టీడీపీపై బురద జల్లేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తే మాత్రం పోటీగా మేం కూడా విడుదల చేస్తామని ప్రకటించారు.