కాకినాడ : వేసవి సెలవులు కావడంతో ఆ చిన్నారులిద్దరూ ఆటలాడుకుంటున్నారు. పాడుబడిన స్కూల్ లో చెక్కపెట్టెలో దూరి ఆటలు ఆడుదామనుకుని ప్రయత్నించారు. చెక్కపెట్టెలో దూరి మూత వేసుకోవడంతో ఊపిరాడక మృతిచెందారు. 

ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం చిన్నయ్య పాలెం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈనెల 26న రాజవొమ్మంగికి చెందిన బేలెం ప్రశాంత కుమార్, చెడెం కార్తీక్ ఇద్దరూ స్నేహితులు. 

ఆటలాడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు జడ్డంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులు, గ్రామస్థులతో కలిసి చిన్నారులను వెతుకుతూనే ఉన్నారు. 

అయితే పాడుబడిన స్కూల్ వద్ద దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పాడుబడిన స్కూల్లో పెట్టెను తెరిచి చూడగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు ప్రత్యక్షమయ్యాయి. నాలుగు రోజుల క్రితం చనిపోవడంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. 

ఆడుకుంటూ చిన్నారులిద్దరూ పెట్టెలో దూరి ఉంటారని పెట్టెలో దూరిన తర్వాత మూత మూసుకుపోవడంతో బయటకు రాలేక చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్డంగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు.