కుప్పంలో అయినా, నగరిలో అయినా తాను సిద్ధమని.. ఇద్దరి మేనిఫెస్టోలు తీసుకొచ్చి ఎవరెన్ని అమలు చేశారో తేల్చుకుందామని టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. చంద్రబాబు సెల్ఫీలు దిగడం లేదని, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు.  

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు మంత్రి రోజా. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ స్టిక్కర్లు చూస్తే చంద్రబాబు గుండెల మీదో ఎవరో కొట్టినట్లుగా వుంటోందని వ్యాఖ్యానించారు. కొందరు దొంగతనంగా స్టిక్కర్లు పీకేస్తున్నారని.. చంద్రబాబు, పవన్‌లు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు సెల్ఫీలు దిగడం లేదని, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు ముసలి నాయకుడని.. ఈ వయసులో ఓ మూలన కూర్చోకుండా ఇంకా కుట్రలు పన్నుతున్నారంటూ రోజా ఆరోపించారు. కుప్పంలో అయినా, నగరిలో అయినా తాను సిద్ధమని.. ఇద్దరి మేనిఫెస్టోలు తీసుకొచ్చి ఎవరెన్ని అమలు చేశారో తేల్చుకుందామని రోజా సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఎవరితో సెల్ఫీ దిగుతారో తెలుస్తుందన్నారు. 

చంద్రబాబు ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేశారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబే క్యాన్సర్ గడ్డ అని.. యువతను మోసం చేశారని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని.. తమ పాలన ఎలా వుందో తెలుసుకుంటున్నామని రోజా తెలిపారు. ప్రజల ఇంటికే వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్తున్నారని .. ఏడు లక్షల మంది జగన్ సైనికులు ప్రతి ఇంటికి వెళ్తున్నారని మంత్రి పేర్కొన్నారు. 63 లక్షల 93 వేల మంది ఇళ్లకు తమ సైనికులు వెళ్లారని.. రాష్ట్ర చరిత్రలోనే ఇదో సంచలనమని మంత్రి రోజా చెప్పారు. 

Also Read: పీకే స్కెచ్ వేస్తున్నాడు .. షర్మిల, విజయమ్మలను చంపేస్తారు : డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు జగనన్నే అనే సర్వేలో 7 లక్షల మంది జగనన్న సైనికులు పాల్గొన్నారని చెప్పారు. వారం రోజుల్లోనే వీరంతా 61 లక్షల ఇళ్లను సందర్శించారని.. జగనన్నకు మద్ధతుగా 47 లక్షల మంది మిస్డ్ కాల్ చేశారని జోగి రమేశ్ పేర్కొన్నారు. ఈ మెగా పీపుల్స్ సర్వే భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా మంత్రి అభివర్ణించారు.