Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో కిడ్నాప్ కలకలం.. మిర్చి యార్డులో వ్యాపారిని ఎత్తుకెళ్లిన దుండగులు..!

ఆంధ్రప్రదేశ్ లో మిర్చి వ్యాపారి కిడ్నాప్ ఆందోళన కలిగించింది. ఓ వ్యాపారిని గుర్తు తెలియని ఆరుగురు కిడ్నాప్ చేశారు. పోలీసుల చాకచక్యంతో ఆ వ్యాపారి బయటపడ్డాడు. 

mirchi merchant Kidnapping in Guntur, andhra pradesh - bsb
Author
First Published Feb 2, 2023, 7:26 AM IST

గుంటూరు : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మిర్చి యార్డులో కిడ్నాప్ కలకలం సృష్టించింది.  ఓ మిర్చి వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు మిర్చి యార్డ్ సమీపంలోనే కిడ్నాప్ చేశారు. అయితే,  విషయం తెలియడంతో పోలీసులు వెంటనే స్పందించారు. కిడ్నాప్ కి గురైన వ్యాపారిని దుండగుల నుంచి కాపాడారు. ఈ ఘటన గుంటూరులో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పొత్తూరి శివ నరేంద్ర కుమార్ కొత్తపేటకు చెందిన మిర్చివ్యాపారి. వ్యాపారం నిమిత్తం రోజులాగే బుధవారం ఉదయం కూడా తన టూ వీలర్ మీద  మిర్చియార్డుకు బయలుదేరాడు. 

అయితే, అతని కోసం మార్గమధ్యంలో అప్పటికే దుండగులు కాపు కాసి ఉన్నారు. ఒక్కసారిగా ఆరుగురు దుండగులు అతని మీద దాడి చేశారు. శివ నరేంద్ర కుమార్ ను తమతో తీసుకువచ్చిన కారులోకి ఎక్కించి, బలవంతంగా ఎత్తుకెళ్లారు. అయితే ఈ విషయం నరేంద్ర కుమార్ కొడుకు కృష్ణ చైతన్యకు తెలిసింది.  వెంటనే అతను నగరపాలం పోలీసులను ఆశ్రయించాడు. తండ్రి కిడ్నాప్ విషయంలో ఫిర్యాదు చేశాడు.

అంతేకాదు కిడ్నాప్ వెనక  దేవాపురానికి చెందిన మిర్చి వ్యాపారి బర్మా వెంకట్రావు ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశాడు.  తన తండ్రిని కిడ్నాప్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు మేరకు సీఐ హైమారావు వెంటనే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కిడ్నాప్ సమాచారం అందించారు.

టీడీపీ మండలాధ్యక్షుడిపై కాల్పులు.. పల్నాడులో దారుణం..

దీంతో పోలీసులు అన్నిచోట్ల తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వినుకొండ వద్ద పోలీసుల తనిఖీలు గమనించిన దుండగులు.. పట్టుబడి పోతామన్న విషయం అర్థమై నరేంద్ర కుమార్ ను కారులోనే వదిలేసి పారిపోయారు. అప్పటికే నరేంద్ర కుమార్ కు సంబంధించిన సమాచారం ఉండడంతో పోలీసులు అతనిని గుర్తించి, కాపాడి గుంటూరుకు తరలించారు. 

దీనిమీద బాధితుడు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ..  ‘కారులోకి ఎక్కించిన తర్వాత నన్ను కొట్టారు. రూ. కోటిన్నర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడ చంపేస్తారో నన్న ప్రాణం భయంతో సరైనని అన్నాను. కోటప్పకొండ దగ్గర బర్మా వెంకట్రావు కిడ్నాపర్లతో కలిశాడు. నన్ను కొట్టడంతో రక్తాలు వచ్చాయి. దీంతో చొక్కాకు రక్తం అంటింది. చొక్కా మార్చేందుకు కారును వినుకొండ వద్ద ఆపారు. ఆ సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారు నన్ను చూసి రక్షించారు’  అని చెప్పుకొచ్చాడు. 

నరేంద్రకుమార్ ను కిడ్నాప్ చేసిన నిందితుల గురించి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. కిడ్నాప్ సూత్రధాని బర్మా వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర కుమార్ కిడ్నాప్ విషయం గుంటూరులో కలకలం రేపింది. దీంతో, అంతకుముందు మిర్చి యార్డులోని మిగతా వ్యాపారులు ఆందోళన చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios