హెచ్ఐవీ ఉందని చెప్పినా వినకుండా.. ఓ వ్యక్తి 15ఏళ్ల బాలికకు నరకం చూపించాడు. ప్రేమ, పెళ్లి అంటూ వెంటపడి.. బలవంతంగా మెడలో తాళికట్టి.. బెదిరించి కాపురం చేశాడు. మూడు నెలల తర్వాత బాలిక వాడి చెర నుంచి తప్పించుకొని.. పోలీసులను ఆశ్రయించింది. ఈ విషాద సంగటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్ కి చెందిన ఓ మహిళ 2015లో హెచ్ఐవీ తో కన్నుమూసింది. ఆమె వ్యాధి కూతురికి కూడా సోకిందన్న విషయం ఆలస్యంగా తెలిసింది. దీంతో బాలికను ఆమె తండ్రి ఆదోనిలోని స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. అక్కడే ఉంటూ హెచ్ఐవీకి చికిత్స తీసుకుంటూ.. విద్యనభ్యసిస్తోంది.

కొన్ని నెలల క్రితం తండ్రికి ఆరోగ్యం సరిగాలేకపోతే... స్వగ్రామానికి వచ్చింది. కాగా.. బాలికను అదే గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. తనకు హెచ్ఐవీ ఉందని బాలిక చెప్పినా వినకుండా బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకొని మూడు నెలల పాటు కాపురం చేశాడు.

మూడునెలల తర్వాత అతని బారి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.