ఇద్దరు యువకులు... బాలిక చావుకు  కారణమయ్యారు. వారిలో ఒకరు బాలిక ప్రేమించిన వాడే కావడం గమనార్హం. ఒకడు బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పుకోలేక బాలిక.. తన ప్రియుడికి విషయం చెబితే... చెడిపోయావంటూ నీచంగా మాట్లడాడు. అక్కడితో ఆగకుండా ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా టి. నరసాపురానికి చెందిన 14ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కాగా... ఆ బాలిక కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన సుబ్రమ్మణ్యం అనే యువకుడితో ప్రేమలో ఉంది. కాగా.. ఇటీవల బాలిక గ్రామంలోని గుడిలో నిర్వహించిన భజన కార్యక్రమానికి హాజరయ్యింది.

అది పూర్తైన తర్వాత రాత్రి సమయంలో ఒంటరిగా ఇంటికి వెళ్తుంటే... ఆమెను అదే గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు అడ్డగించాడు. ఎవరూ చూడటం లేదని తేల్చుకొని బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి... అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇంటికి చేరుకున్న బాలిక.. విషయం ఎవరికి చెప్పాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది. చివరకు ప్రియుడు సుబ్రహ్మణ్యంతో విషయం చెప్పగా.. అతను ఆమెనే తిట్టి.. నానా రకాల మాటలతో వేధించాడు.

నువ్వు చెడిపోయావు.. ఇక బతికి లాభం లేదు చచ్చిపో అంటూ... ఆమె మనసు గాయపరిచాడు. అక్కడితో ఆగకుండా ఈ నెల 9న కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి బాలికతో తాగించాడు. ఆపై స్కూల్‌కి వెళ్లిన ఆమె.. అక్కడే కళ్లు తిరిగి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె కన్నుమూసింది. కాగా.. చనిపోవడానికి ముందు బాలిక మరణ వాంగ్మూలం ఇచ్చింది. ఆమె చావుకు రాజు, సుబ్రహ్మణ్యంలే కారణమని పోలీసులు  తేల్చారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.