ఇద్దరు బాలుర మధ్య తలెత్తిన ఒకరి ప్రాణానికి కారణమైంది. విశాఖపట్నం పాతకరాసాకు చెందిన మరుబారికి రామారావు కుమారుడు విజయ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో బక్రీద్‌ సందర్భంగా సోమవారం సెలవు కావడంతో ఇంటి దగ్గరలోని ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు.

పాతకరాసాకే చెందిన చిన్న సాయితో కలిసి రెండు టీములుగా ఏర్పడి క్రికెట్ ఆడాడు.  రెండు ఆటల్లో విజయ్ టీమ్ గెలిచింది. మూడో మ్యాచ్‌లో కూడా గెలిచేలా ఉండటంతో సాయి గొడవపడ్డాడు.

రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరగడంతో సాయి... విజయ్‌ కడుపు భాగంలో చేతితో పిడిగుద్దులు గుద్దడమే కాకుండా బ్యాట్‌తో కొట్టాడు. తీవ్రమైన నొప్పితో విజయ్ మైదానంలోనే పడిపోయాడు.

కొద్దిసేపటి తరువాత మిత్రుల సాయంతో ఇంటికి చేరుకున్నాడు. కడుపు నొప్పి ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.

అయితే కడుపు లోపలి భాగంలో బలమైన దెబ్బలు తగలడంతో మంగళవారం రాత్రి విజయ్ మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

"