నెల్లూరు: మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ సోమవారం ఉదయం కృష్ణాపురం హై లెవల్ కెనాల్ ఫేజ్-2 పైలాన్ ప్రారంభోత్సవానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. మంత్రులు కాన్వాయ్ లోని వాహనాలన్నీ వేగంగా వెళుతుండగా మొదటి వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వెనకాల వున్న వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో మంత్రుల వాహన శ్రేణిలోని మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.  

ఈ ప్రమాదం నుండి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురయిన వాహనాల్లో వున్నవారు కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్‌ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ప్రమాదానికి గురయిన వాహనాలను కాన్వాయ్ నుండి తప్పించి మిగతా వాహనాలు ముందుకు వెళ్లాయి.