Asianet News TeluguAsianet News Telugu

రాజీనామా చేయమన్నవారిపై కేసులు పెట్టమంటున్న మంత్రులు... ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితేంటి..?

ఏపీలో ఎన్నికల ముందు లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. వైసీపీకి అనుకూలంగా అనేక మంది ప్రచారం చేశారు. అనూహ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితేంటి..?

ministers anger on volunteers.. suggested that cases be filed against those who pressured them to resign GVR
Author
First Published Jun 19, 2024, 11:09 AM IST

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇలా దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను నియమించింది. వారంతా తమ సైన్యమని, వైసీపీకి అనుకూలంగా ఉండేవారినే నియమించామని అనేక సార్లు ఆ పార్టీ అధినేత జగన్‌ సహా అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగంగానే చెప్పారు. అలా అయిదేళ్లు సచివాలయాలకు అనుబంధంగా ఉంటూ వైసీపీ చెప్పిన ప్రతి పని చేశారు వాలంటీర్లు. 

ఎన్నికల నేపథ్యంలో పార్టీ కోసం పనిచేయాలని, మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రచారం చేయాలని వైసీపీ నాయకులు వాలంటీర్లకు పిలుపునిచ్చారు. దీంతో అనేక మంది వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.... వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం పెట్టింది. ఎన్నికల ప్రచారం పాల్గొంటే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాదాపు లక్ష మందికిపైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. వైసీపీ నాయకుల ఒత్తిడితోనే, అభిమానంతోనే.. ఇలా ఏవేవో కారణంగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. చాలా మంది వైసీపీకి అనుకూలంగా ప్రచారాలు, ఇతర పనులు చేశారు. కొందరైతే ఎన్నికల సమయంలో వైసీపీకి పోలింగ్‌ ఏజెంట్లుగానూ ఉన్నారు. 

ఎన్నికల తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. వైసీపీ జాడ లేకుండా పోయింది. 11 అసెంబ్లీ సీట్లకే వైసీపీ పరిమితమై అధికారం కోల్పోయింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రాజీనామాలు చేసిన వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించుకుంటున్నారు. అయితే, వాలంటీర్లను రాజీనామాలపై నిలదీస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. వైసీపీ ఒత్తిడి కారణంగానే రాజీనామా చేశామని వాలంటీర్లు చెబుతుండటంతో..... రాజీనామా చేయమని ఒత్తిడి చేసినవారిపై కేసులు పెట్టి రావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. 

తాజాగా మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడును పలువురు వాలంటీర్లు కలిశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విన్నవించగా... వారిపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారో వారిపై కేసు పెట్టి రండి.. అప్పుడు అలోచిద్దామన్న మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ‘‘దండం పెట్టి చెప్పా.. రాజీనామా చేయకండి అని. వినలేదు. ఇది రాష్ట్ర పాలసీ. ఏమి చేయలేం అని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాలంటీర్లు వెనుదిరిగారు. 

 

గత ఐదేళ్లలో వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌తో పాటు ఆ పార్టీ నాయకులు అనేక కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో మాత్రం వాలంటీర్లను తొలగించబోమని చంద్రబాబు, కూటమి నేతలు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని, వాలంటీర్లకు రూ.10వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేసి.. వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. 

వాలంటీర్‌ వ్యవస్థపై ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ... ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. పాత వారిని కొనసాగిస్తారా..? లేక, కొత్తవారిని నియమిస్తారా అన్న అంశంపై స్పష్టత లేదు. రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటన్న దానిపై క్లారిటీ లేదు. వచ్చే నెల (జులై)లో పింఛన్ డబ్బు వాలంటీర్లతో ఇంటింటికీ పంపిణీ చేస్తారా.. లేక, బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారో ఇంకా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల విషయంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios