జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. రఫేల్ సూత్రధారి మోదీ, అవినీతిపరుడు జగన్ లను విమర్శించడం మానేసి చంద్రబాబును విమర్శించడం పవన్ లాలూచీకి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి ఎవరైనా సీఎం కావొచ్చు అన్నయనమల అయితే ఆ వ్యక్తి అందరివాడు అయి ఉండాలన్నారు.

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. రఫేల్ సూత్రధారి మోదీ, అవినీతిపరుడు జగన్ లను విమర్శించడం మానేసి చంద్రబాబును విమర్శించడం పవన్ లాలూచీకి నిదర్శనమన్నారు. 

రాష్ట్రానికి ఎవరైనా సీఎం కావొచ్చు అన్నయనమల అయితే ఆ వ్యక్తి అందరివాడు అయి ఉండాలన్నారు. మీ అన్నయ్య అందరివాడు సినిమా తీశారు కానీ ప్రజా జీవితంలో కొందరివాడిగానే మిగిలారంటూ యనమల విమర్శలు గుప్పించారు. 

ప్రజారాజ్యం తరఫున పవన్‌‌ ప్రచారం చేసినా పాలకొల్లులో చిరంజీవి ఓడిపోయారని ఆ విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. అందరివాడు కాబట్టే చంద్రబాబు సుమారు 14 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారన్నారు. దేశంలో అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, ఆ విషయం కూడా తెలియని పవన్‌ రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని ఆరోపించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. 

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఆఫ్‌ ఇండియా సర్వే ఏపీలో అవినీతి అతి తక్కువని వెల్లడించిన విషయం పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దేశమంతా రాఫేల్‌‌ స్కామ్‌పై గగ్గోలు పెడుతుంటే పవన్ మాత్రం‌ ఎందుకు ప్రశ్నించటం లేదని యనమల నిలదీశారు. అవినీతిపై పోరాటం చేయాలనుకుంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై చేయాలని సూచించారు. రాఫేల్‌‌ సూత్రధారి మోదీ, అవినీతి పరుడు జగన్‌లను వదిలేసి చంద్రబాబుపై విమర్శలు చేయడంపై యనమల మండిపడ్డారు. 

మోదీని, జగన్ లను పవన్ విమర్శించడం లేదన్నారు. బీజేపీ, వైసీపీలతో పవన్‌ లాలూచీ పడ్డారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలని ధ్వజమెత్తారు. రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ను పవన్‌ వెనకేసుకు వస్తున్నారని దుయ్యబుట్టారు. 

రాజమహేంద్రవరం కవాతు సందర్భంగా పవన్‌ చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబును విమర్శించడమే లక్ష్యంగా పవన్‌ ప్రసంగం కొనసాగిందని ఎద్దేవా చేశారు.